తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Train Tickets : ఇక నుంచి ట్రైన్​ టికెట్​ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు! త్వరలోనే కొత్త విధానం అమలు..

Train tickets : ఇక నుంచి ట్రైన్​ టికెట్​ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు! త్వరలోనే కొత్త విధానం అమలు..

Sharath Chitturi HT Telugu

Published Oct 08, 2025 05:36 AM IST

google News
  • రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్​! ఇక నుంచి ప్రయాణ తేదీని మార్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న కన్ఫర్మ్​ టికెట్​ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైన్​ టికెట్​ ప్రయాణ తేదీని ఆన్​లైన్​లో సులభంగా మార్చుకోవ్చచు. జనవరి నుంచే కొత్త విధానం అమలు కానుంది!
రైలు టికెట్ల తేదీలను మార్చుకోవచ్చు..

రైలు టికెట్ల తేదీలను మార్చుకోవచ్చు..

అనుకోకుండా ప్రయాణ ప్రణాళికలు మారినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు! ముఖ్యంగా డబ్బు పోగొట్టుకోకుండా ప్రణాళికలను సర్దుబాటు చేసుకునేందుకు భారతీయ రైల్వేస్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి నెల నుంచి ప్రయాణికులు తమ కన్ఫర్మ్ అయిన రైలు టికెట్ల ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో, ఎటువంటి రుసుము లేకుండా, మార్చుకోవచ్చు.


టికెట్​ తేదీని మార్చుకోవచ్చు- కానీ..

ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, ప్రయాణికులు ముందుగా తమ ట్రైన్​ టికెట్‌ను రద్దు (Cancel) చేసుకొని, మళ్లీ కొత్త టికెట్‌ను బుక్ చేసుకోవాలి. దీనివల్ల రద్దు చేసుకునే సమయాన్ని బట్టి కొంత మొత్తం డబ్బు కట్ అవుతుంది. ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదిగా, తరచుగా అసౌకర్యంగానూ ఉంటుంది.

"ఈ వ్యవస్థ అన్యాయమైనది, ప్రయాణికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది," అని వైష్ణవ్ అన్నారు. ప్రయాణికులకు అనుకూలమైన ఈ కొత్త మార్పులను అమలు చేయడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ధృవీకరించారు.

అయితే కొత్త తేదీకి కూడా కన్ఫర్మ్ అయిన టికెట్ లభిస్తుందనే హామీ లేదని రైల్వే మంత్రి స్పష్టం చేశారు! కొత్త తేదీకి టికెట్ లభించడం అనేది “సీట్ల లభ్యత”పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, కొత్త టికెట్ ధరలో వ్యత్యాసం ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.

రైలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉన్నా, అధిక రద్దు రుసుములకు భయపడే లక్షలాది మంది ప్రయాణికులకు ఈ మార్పు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందని రైల్వేశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత నియమాల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు కన్ఫర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేస్తే, ఆ టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు. రైలు బయలుదేరడానికి 12 గంటల నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే, ఈ రుసుము మరింత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత టికెట్‌ను రద్దు చేసుకుంటే, సాధారణంగా అసలు డబ్బులు తిరిగి ఇవ్వరు.