సీనియర్ సిటిజన్లకు అసలు పర్సనల్ లోన్ ఇస్తారా? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
Published Jun 23, 2025 07:20 AM IST
- సీనియస్ సిటిజన్లకు పర్సనల్ లోన్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే రూల్స్ ఎలా ఉంటాయి? ఆ పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీనియర్ సిటిజన్లకు అసలు పర్సనల్ లోన్ ఇస్తారా?
వైద్య ఖర్చులు, ట్రావెల్, గృహ మరమ్మత్తు, కుటుంబ అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. లోన్ పొందడం ఒకెత్తు, అసలు పర్సనల్ లోన్‌కి అర్హత సాధించడం ఇంకొకెత్తు. మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు పర్సనల్ లోన్ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అసలు వారికి లోన్ తీసుకునే అర్హత ఉంటుందా? ఒకవేళ ఉంటే.. రూల్స్ ఎలా ఉంటాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వృద్ధులకు పర్సనల్ లోన్ ఎందుకు అవసరం పడుతుంది?
- ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు
- పిల్లల విద్య లేదా వివాహానికి సహాయం
- తమ ఇంటికి మరమ్మతులు లేదా మెరుగుదలలు
- పదవీ విరమణ తర్వాత ప్రయాణ ఖర్చులు
- వారి ఆరోగ్యం లేదా వారి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం
- కొంతమందికి, ముఖ్యంగా వారి ఆదాయ వనరు పెన్షన్ ఆదాయం లేదా వారి పొదుపులపై వడ్డీకి మాత్రమే పరిమితమైతే, రుణాలు ఆర్థిక భద్రతను అందిస్తాయి.
సీనియర్ సిటిజన్లు పర్సనల్ లోన్‌కి అర్హులేనా?
ఈ ప్రశ్న సమాధనం అవును! పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు పర్సనల్ లోన్లు అందించే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు చాలా ఉన్నాయి. అర్హత ప్రమాణాలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ, రుణదాతలు సాధారణంగా తమ కస్టమర్లను ఈ కింది ప్రమాణాలపై అంచనా వేస్తారు:
వయస్సు: సాధారణంగా, ఇది 60 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఆదాయం: సాధారణంగా, క్రమం తప్పకుండా వచ్చే అద్దె ఆదాయం లేదా పెన్షన్ కోసం చూస్తారు.
క్రెడిట్ హిస్టరీ: క్లీన్ పేమెంట్స్ హిస్టరీ కలిగి ఉండటం ముఖ్యం.
కో-అప్లికెంట్: జీతం పొందే, చిన్న వయస్సు గల సహ-రుణగ్రహీతతో అర్హతను మెరుగుపరచుకోవచ్చు.
తక్కువ రుణ మొత్తాలు, తక్కువ కాలపరిమితులు
పని చేసే నిపుణుల్లాగ కాకుండా, వృద్ధులు సాధారణంగా వీటిని పొందవచ్చు:
- తక్కువ రుణ మొత్తాలు (రుణగ్రహీత ప్రొఫైల్‌లను బట్టి రూ. 50,000 నుంచి రూ.5 లక్షల వరకు)
- తక్కువ తిరిగి చెల్లింపు నిబంధనలు (12–60 నెలలు)
- అధిక వడ్డీ రేట్లు, సాధారణంగా సంవత్సరానికి 11% నుంచి 18% వరకు.
ఇది రుణదాతలకు డిఫాల్ట్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తక్కువ సమయంలో తిరిగి చెల్లింపు హామీ పొందుతారు.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు పరిగణించాల్సిన ముఖ్య అంశాలు..
వాస్తవ అవసరాన్ని తెలుసుకోండి: రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అవసరాన్ని తీర్చడానికి ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని ఆలోచించండి. రుణం లేకుండా అవసరాన్ని తీర్చడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేదా మీ నగదు ఆస్తులు లేదా కొన్ని పొదుపులు ఉన్నాయా? అని చూసుకోవాలి.
తిరిగి చెల్లింపు భారాన్ని అర్థం చేసుకోండి: మీ ఈఎంఐలను బాగా అర్థం చేసుకోవడానికి రుణ ఈఐఎం కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. అవి జీవన ఖర్చులు లేదా కొనసాగుతున్న వైద్య ఖర్చుల వంటి ముఖ్యమైన కట్టుబాట్లకు ఆటంకం కలిగించకుండా చూసుకోండి. అవి మీ నెలవారీ పెన్షన్‌లో సరిపోయేలా చూసుకోండి.
కో-అప్లికెంట్‌ను పరిగణించండి: సహ-రుణగ్రహీతను (చిన్న వయస్సు గల కుటుంబ సభ్యుడు) చేర్చడం ద్వారా మీ
- అర్హతను మెరుగుపరచగలదు
- మీ వడ్డీ రేటును తగ్గించగలదు
- మీ ఆమోదం పొందే అవకాశాన్ని మెరుగుపరచగలదు
ఫైన్ ప్రింట్' చదవండి
ఏదైనా ఫోర్‌క్లోజర్ లేదా ముందస్తు చెల్లింపు ఖర్చుల గురించి తెలుసుకోండి.
- చెల్లింపులు ఆలస్యం అయితే ఏమి జరుగుతుందో తెలుసుకోండి.
- రుణ ప్రాసెసింగ్ ఫీజుల గురించి తెలుసుకోండి.
- ఏదైనా బీమా నిబంధనలు లేదా షరతుల గురించి తెలుసుకోండి (కొన్ని రుణదాతలు వృద్ధుల రుణ ఫైనాన్సింగ్‌తో ఆరోగ్యం, జీవిత బీమాను అందిస్తారు).
సీనియర్ సిటిజన్లకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు..
(సోర్స్- పైసా బజార్)
బాధ్యతాయుతమైన రుణాల కోసం టిప్స్..
రుణాల సంఖ్యను పరిమితం చేయండి: వీలైనంత తక్కువ రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ రుణాలు ఆర్థిక భారాన్ని పెంచుతాయి.
ఈఎంఐలను నియంత్రించండి: మీ నెలవారీ ఆదాయంలో 40-50% కంటే ఎక్కువ ఈఎంఐలు (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లు) ఉండేలా చూసుకోకండి. ఇది మీ ఇతర ఖర్చులు, పొదుపులకు ఆటంకం కలిగిస్తుంది.
అత్యవసర నిధిని మెయిన్టైన్ చేయండి: ఊహించని ఖర్చుల కోసం ఎల్లప్పుడూ ఒక అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకోండి. ఇది మీరు అకస్మాత్తుగా రుణాలు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయండి: పదవీ విరమణ తర్వాత కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో అవసరమైతే మెరుగైన రుణ నిబంధనలను పొందడానికి సహాయపడుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి..
"వృద్ధులు వ్యక్తిగత రుణాలను చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలి. దానికి బదులుగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), బంగారం లేదా బీమా పాలసీలపై రుణాల వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. వ్యక్తిగత రుణాలు సాధారణంగా ఖరీదైనవి (వడ్డీ 11-16% లేదా అంతకంటే ఎక్కువ). చాలా బ్యాంకులు రుణ అర్హతను పదవీ విరమణ వయస్సులో 70-75 సంవత్సరాలకు పరిమితం చేస్తాయి. మీ పెన్షన్ లేదా ఇతర స్థిరమైన పదవీ విరమణ ఆదాయంతో ఈఎంఐలు భరించగలిగేలా చూసుకోండి. ఆదాయంలో 30-40% ఈఐఎం నియమాన్ని పాటించండి. మీ నెలవారీ ఆదాయంలో అంతకు మించి కట్టుబడి ఉండకండి," అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ అసెట్ బిజినెస్ డివిజన్ జనరల్ మేనేజర్ శ్రీ సుబోధ్ కుమార్ సూచించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు తరచుగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయని, పెన్షనర్ల కోసం ప్రత్యేక పథకాలను కలిగి ఉండవచ్చని ఆయన వివరించారు. "ఈఎంఐ నిర్వహించగలిగేంతవరకు, సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోండి. తక్కువ కాలపరిమితి వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. బాధ్యతను త్వరగా ముగిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు జరిమానాలు, బీమా ప్రీమియంలు మొదలైనవాటిని సమీక్షించండి. రుణ రక్షణ బీమా ఈఎంఐని భారీగా పెంచకపోతే మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన వివరించారు.