November 1st New Rules : నవంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్.. మీ జేబుపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
28 October 2024, 20:30 IST
- New Rules From November 1st : ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొన్ని రకాల కొత్త రూల్స్ వస్తుంటాయి. దీనితో సామాన్యుడి జేబుపై ప్రభావం పడుతుంది. నవంబర్ 1 నుంచి వచ్చే కొత్త రూల్స్ ఏంటో చూడండి..
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్
అక్టోబర్ నెల ముగిసేందుకు దగ్గరకు వచ్చింది. నవంబర్ 1 నుండి అనేక నియమాల్లో మార్పులు జరగనున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ మార్పులలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలలో మార్పులు, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నియమాలలో మార్పులు ఉంటాయి.
చమురు కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. ఇటీవల స్థిరంగా ఉన్న 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలను నవంబర్ 1న మార్చవచ్చు. అయితే వాణిజ్య సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. చివరిసారిగా అక్టోబర్ 1న దిల్లీలో రూ.48.50 పెరిగింది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సిద్ధమైంది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల(ఏఎంసీలు) ఫండ్‌లలో నామినీలు, వారి దగ్గరి బంధువులు చేసిన రూ. 15 లక్షల కంటే ఎక్కువ విలువైన లావాదేవీల గురించిన సమాచారాన్ని నివేదించాలి.
స్పామ్‌ను అరికట్టడానికి మెసేజ్ ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. టెలికాం కంపెనీలు స్పామ్ నంబర్‌లను బ్లాక్ చేస్తాయి. దీని కారణంగా వారి సందేశాలు వినియోగదారులకు చేరవు. కంపెనీలు తమ వినియోగదారులకు సందేశం చేరుకోవడానికి ముందే స్పామ్ జాబితాలో ఉంచడం ద్వారా నంబర్‌ను బ్లాక్ చేస్తాయి.
చమురు కంపెనీలు ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా ప్రతి నెల 1వ తేదీన సర్దుబాటు చేస్తాయి. ఇటీవలి నెలల్లో ఏటీఎఫ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈసారి పండుగల సమయంలో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. సీఎన్జీ, పీఎన్జీ రేట్లు కూడా మారవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం కొత్త మార్పులను అమలు చేస్తుంది. కొత్త నియమాలు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించినవి. నవంబర్ 1 నుండి మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ప్రతి నెల ఫైనాన్స్ ఛార్జీగా రూ. 3.75 చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా విద్యుత్, నీరు, ఎల్‌పీజీ గ్యాస్, ఇతర యుటిలిటీ సేవలకు రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.