Narayana Murthy : బెంగళూరులోనే అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి..
08 December 2024, 7:41 IST
- Narayana Murthy new flat : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తాజాగా ఒక ఇల్లు కొన్నారు. కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఈ ఇల్లు కోసం రికార్డు స్థాయిలో డబ్బులు ఖర్చు చేశారు!
రూ. 50 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న నారాయణ మూర్తి..
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి. కింగ్‌ఫిషర్ టవర్స్‌లో రెండో అపార్ట్‌మెంట్‌ను ఆయన కొనుగోలు చేశారు. 16వ అంతస్తులో ఉన్న 8,400 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.50 కోట్లకు కొన్నారని సమాచారం. అంటే స్క్వేర్ ఫుట్కి రూ. 59,500 రికార్డు స్థాయి ఖర్చు చేసినట్టు.
4 బెడ్రూమ్లు, ఐదు పార్కింగ్ స్థలాలతో కూడిన ఈ లావాదేవీని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఇది నగరంలోని అత్యంత ఖరీదైన హౌజింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
అయితే ఈ వార్తలపై నారాయణ మూర్తి స్పందించలేదు. మూర్తి సమాధానం కోరుతూ పంపిన ఈమెయిల్‌కు స్పందన రాలేదు. హెచ్‌టీ తెలుగు, లైవ్ మింట్ ఈ వార్తాని వెరిఫై చేయలేకపోయాయి.
బెంగళూరు నడిబొడ్డున ఉన్న కింగ్‌ఫిషర్ టవర్స్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన మాజీ ఎస్టేట్‌లో భాగం. 34 అంతస్తుల లగ్జరీ డెవలప్ మెంట్ని 2010లో ప్రెస్టీజ్ గ్రూప్, విజయ్ మాల్యా సంయుక్త ప్రాజెక్టుగా నిర్మించారు. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌లో సగటున 8,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 81 అపార్ట్మెంట్లు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులో తొలుత కొన్ని అపార్ట్ మెంట్లను ప్రారంభించినప్పుడు చదరపు అడుగుకు రూ.22,000 చొప్పున విక్రయించారు. కొన్నేళ్లుగా, ఈ ప్రాపర్టీ అధిక-ప్రొఫైల్ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఫలితంగా దాని రీసేల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం.
కింగ్‌ఫిషర్ టవర్స్ గురించి ఇవి మీకు తెలుసా..?
కింగ్‌ఫిషర్ టవర్స్‌లో ఇదొక్కటే హై ప్రైజ్ డీల్ కాదు. నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి నాలుగేళ్ల క్రితం 23వ అంతస్తులో రూ.29 కోట్లకు ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షాకి కూడా ఇక్కడ ఇల్లు ఉంది.
ఇటీవలి కాలంలో బెంగళూరులో పలు రియల్ ఎస్టేట్ డీల్స్ అందరిని ఆకర్షించాయి. క్వెస్ట్ గ్లోబల్ చైర్మన్, సీఈఓ అజిత్ ప్రభు 2017లో హెబ్బాల్ సమీపంలోని ఎంబసీ వన్‌లో.. చదరపు అడుగుకు రూ.31,000 చొప్పున రూ.50 కోట్లకు 16,000 చదరపు అడుగుల ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు. రెండేళ్ల క్రితం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రాణా జార్జ్ రూ.35 కోట్లకు ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు.
మూర్తి తాజా కొనుగోలు బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్ హౌజింగ్, రియల్ ఎస్టేట్‌కి కేరాఫ్ అడ్రెస్ హోదాను బలోపేతం చేస్తుంది. దాని ఐకానిక్ ప్లేసింగ్, లగ్జరీ ఆకర్షణ భారతదేశ ఉన్నత వర్గాలను ఆకర్షిస్తూనే ఉంది.