Google : ఖతర్నాక్ గూగుల్! జీపీఎస్ ఆఫ్ చేసినా.. మీ లోకేషన్‌ని ఇలా ట్రాక్ చేస్తూనే ఉంటుంది
20 October 2024, 6:44 IST
Google tracking methods : జీపీఎస్‌ని ఆఫ్ చేస్తే మీ లొకేషన్ని ట్రాక్ చేయడం కష్టమని అనుకుంటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే! జీపీఎస్ లేకపోయినా చాలా పద్ధతుల్లో గూగుల్ మీ లొకేషన్ని ట్రాక్ చేయగలదు!
మీ లోకేషన్‌ని గూగుల్ ఇలా ట్రాక్ చేస్తూనే ఉంటుంది..!
మీరు వాడే ఫోన్లో మీ లోకేషన్‌ని ట్రాక్ చేయడానికి జీపీఎస్ ఒక్కటే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జీపీఎస్‌ని ఆఫ్ చేస్తే, మీ లొకేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కి తెలియదని భావిస్తున్నారా? అయితే మీరు ఈ షాకింగ్ విషయం తెలుసుకోవాల్సిందే! జీపీఎస్ లేకుండా కూడా మీ లొకేషన్ని ట్రాక్ చేయడానికి గూగుల్ వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. గూగుల్ మ్యాప్స్ తమ కదలికలను పర్యవేక్షిస్తుందని చాలా మంది వినియోగదారులు గుర్తించినప్పటికీ, ఆండ్రాయిడ్ పరికరాలు మల్టిపుల్ ఇన్-బిల్ట్ యాప్స్ ద్వారా డేటాను సేకరిస్తాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో జీపీఎస్ లేకుండా గూగుల్ లొకేషన్ని ఎలా, ఎన్ని విధాలుగా ట్రాక్ చేస్తుందో, వాటిని ఎలా డీల్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..
గూగుల్ మీ లొకేషన్ని ఇలా ట్రాక్ చేస్తుంది..
1. వై-ఫై పొజిషనింగ్: మీ పరికరం కనెక్ట్ చేసే లేదా గుర్తించే వై-ఫై నెట్వర్క్ నుంచి డేటాను గూగుల్ ఉపయోగిస్తుంది. సమీప రౌటర్ల నుంచి సిగ్నల్ బలం ఆధారంగా మీ లొకేషన్ని పసిగడుతుంది. మీ పరికరం దాని లొకేషన్ని ఖచ్చితంగా చెప్పగలదు.
2. వై-ఫై నెట్వర్క్ డేటాబేస్: యూజర్ డివైజ్‌ల నుంచి సేకరించిన వై-ఫై నెట్వర్క్ లొకేషన్ల సమగ్ర డేటాబేస్‌ను గూగుల్ సేకరిస్తుంది. ఈ సమాచారం జీపీఎస్ లేకుండా కూడా లొకేషన్ ట్రాకింగ్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
3. సెల్ టవర్ ట్రయాంగ్యులేషన్: మీ పరికరం సమీపంలోని సెల్ టవర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. బహుళ టవర్ల నుంచి సిగ్నల్ బలాన్ని విశ్లేషించడం ద్వారా, గూగుల్ మీ లోకేషన్‌ని అంచనా వేయగలదు. అయితే ఈ పద్ధతి జీపీఎస్ కంటే తక్కువ ఖచ్చితమైనది.
4. బ్లూటూత్ పరికరాలు: బహిరంగ ప్రదేశాల్లో సమీప పరికరాలు లేదా స్టోర్స్‌లోని బీకన్ల నుంచి బ్లూటూత్ సంకేతాలను గూగుల్ గుర్తించగలదు. ఈ సామర్థ్యం నిర్దిష్ట ప్రదేశాలకు మీ లొకేషన్ని అంచనా వేయడానికి అనుమతిస్తుంది.
5. IP అడ్రెస్: ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం వల్ల మీ పరికరానికి ఒక IP అడ్రెస్ కేటాయించడం జరుగుతుంది. ఇది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ భౌగోళిక ప్రాంతం ఆధారంగా మీ లొకేషన్ అంచనాను అందిస్తుంది.
6. యూజర్ ఇన్పుట్: గూగుల్ సేవలతో మీ స్థానాన్ని మాన్యువల్‌గా భాగస్వామ్యం చేయడం వల్ల మీ లొకేషన్ డేటాను శుద్ధి చేయవచ్చు. జీపీఎస్ అందుబాటులో లేనప్పుడు ఇది ఖచ్చితత్వాన్ని పెంచుతుంది.
7. సెన్సార్ డేటా: యాక్సెలరోమీటర్లు, గైరోస్కోప్‌లు అమర్చిన పరికరాలు కదలికలు, ఓరియెంటేషన్ని ట్రాక్ చేయగలవు. ముఖ్యంగా ఇతర ట్రాకింగ్ పద్ధతులతో కలిపినప్పుడు లొకేషన్ మార్పులను అంచనా వేయడానికి గూగుల్ ఈ డేటాను విశ్లేషిస్తుంది.
8. జియోఫెన్సింగ్: లొకేషన్ పర్మిషన్స్ ఉన్న యాప్స్ జీపీఎస్ లేకుండానే నిర్దిష్ట ప్రాంతాలకు దగ్గరగా ఉండటం ఆధారంగా నోటిఫికేషన్లను ట్రిగ్గర్ చేయడానికి జియోఫెన్సెస్ని క్రియేట్ చేస్తాయి.
గూగుల్ ట్రాకర్స్‌ని ఎలా ఆపాలి?
1. యాక్టివిటీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి: లొకేషన్ ట్రాకింగ్‌ను పరిమితం చేయడానికి, మీ గూగుల్ అకౌంట్లోని 'మై యాక్టివిటీ'కి నావిగేట్ చేయండి. ‘వెబ్ & యాప్ యాక్టివిటీ’, 'లొకేషన్ హిస్టరీ'ని నిర్వహించడానికి 'యాక్టివిటీ కంట్రోల్స్'ను యాక్సెస్ చేసుకోండి. వీటిని నిలిపివేయండి లేదా మీ హిస్టరీని సేవ్ చేయడం ఆపివేయండి.
2. సేకరించిన డేటాను తొలగించండి: గతంలో సేకరించిన డేటాను తొలగించడానికి, 'మై గూగుల్ యాక్టివిటీ'ని సందర్శించండి. 'యాక్టివిటీని డిలీట్ చేయండి' అనే ఆప్షన్ని ఎంచుకోండి. మీకు ఇష్టమైన కాలపరిమితిని ఎంచుకోండి. మీరు అన్ని సమయాలను తొలగించడానికి లేదా నిర్దిష్ట కస్టమ్ తేదీలను సెట్ చేయడానికి ఎంచుకోవచ్చు.
3. హిస్టరీని సెక్యూర్ చేసుకోండి : మీ హిస్టరీని యాక్సెస్ చేయడానికి లేదా తొలగించడానికి పాస్వర్డ్ అవసరం కోసం 'మేనేజ్ మై యాక్టివిటీ వెరిఫికేషన్'ను ప్రారంభించండి. మీ యాక్టివిటీ డేటా కోసం ఆటో-డిలీట్ ఆప్షన్లను సెట్ చేయడాన్ని పరిగణించండి.
4. డివైజ్ సెట్టింగ్స్ అడ్జెస్ట్ చేయండి: మీ ఆండ్రాయిడ్ పరికరంలో, వివిధ ట్రాకింగ్ కార్యకలాపాలను నిలిపివేయడానికి 'సెట్టింగ్స్' యాక్సెస్ చేయండి. 'యాక్టివిటీ కంట్రోల్స్' కోసం శోధించండి. అదనంగా, కొన్ని యాప్ ఫంక్షనాలిటీలను నిలుపుకుంటూ ట్రాకింగ్‌ని పరిమితం చేయడానికి 'లొకేషన్' సెట్టింగ్స్‌లో 'యూజ్ లొకేషన్'ను తొలగించండి.