Google maps: గూగుల్ మ్యాప్స్ తో ఇకపై ప్రయాణం మరింత ఈజీ.. అన్ని వివరాలు ఫింగర్ టిప్స్ పై..
25 July 2024, 20:22 IST
ప్రయాణీకులకు మరింత సహాయపడేలా గూగుల్ మ్యాప్స్ ను అప్ గ్రేడ్ చేశారు. కొత్తగా రియల్ టైమ్ పరిస్థితిని వివరించే రూటింగ్ ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఇరుకైన రోడ్ల గురించి, ఫ్లై ఓవర్ల గురించి ముందే హెచ్చరిస్తుంది. బెంగళూరుతో పాటు పలు ప్రధాన నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ మ్యాప్స్ తో ఇకపై ప్రయాణం మరింత ఈజీ..
హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రధాన నగరాల్లోని ప్రయాణికులకు శుభవార్త. వాహనంతో ప్రయాణించే సమయంలో ఇరుకైన లేన్లను నివారించే లక్ష్యంతో నాలుగు చక్రాల వాహనాలపై ప్రయాణించే వినియోగదారుల కోసం గూగుల్ ఇండియా కొత్త రూటింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ద్విచక్ర వాహన వినియోగదారుల కోసం మ్యాప్ ఆధారిత నావిగేషన్ ను గూగుల్ ఇప్పటికే విజయవంతంగా మెరుగుపరిచింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాహనదారుల ప్రయాణ కష్టాలను పరిష్కరిస్తున్నామని గూగుల్ మ్యాప్స్ ఇండియా జీఎం లలితా రమణి తెలిపారు. ‘‘ఇప్పుడు కొత్త ఏఐ (AI) మోడల్ ను రూపొందించాము. ముఖ్యంగా రహదారి వెడల్పులను అంచనా వేసే భారతీయ రోడ్ల కోసం ఈ మోడల్ ను రూపొందించాం. ఇది ఉపగ్రహ చిత్రాలను తీసుకొని స్ట్రీట్ వ్యూ చిత్రాలతో మిళితం చేస్తుంది. అలాగే, రోడ్డు రకం, చెట్ల కవర్, స్తంభాలు, మురుగు కాల్వలపై కూడా సమాచారం ఇస్తుంది’’ అని వివరించారు.
ఇరుకైన రోడ్ల గురించి ముందే సమాచారం
‘‘భారతదేశంలోని విస్తృతమైన రహదారులు, ఇరుకు రోడ్ల నెట్ వర్క్ ను సమన్వయ పర్చడం పెద్ద సవాలుతో కూడుకున్న విషయం. ఇరుకైన వీధులను కప్పేసిన చెట్లు, రోడ్డు పక్కగా పార్క్ చేసిన వాహనాలు వంటి విభిన్న అడ్డంకుల మధ్య రహదారి వెడల్పులను ఖచ్చితంగా అంచనా వేయడం పెద్ద సవాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) రూటింగ్ మోడళ్లను ఉపయోగించి, వినియోగదారులను సాధ్యమైన చోట ఇరుకైన రోడ్ల నుండి దూరంగా వెళ్లేలా సూచనలు ఇవ్వడానికి అల్గారిథమ్ లను అభివృద్ధి చేశాం’’ అని వివరించారు.
బైకర్లకు యూజ్ ఫుల్
"ఈ ఇరుకైన మార్గాల్లో కార్లు వెళ్లకపోవడం వల్ల బైకర్లు, పాదచారులు ఈ రహదారులను మరింత సురక్షితంగా ఉపయోగించుకుంటారు" అని రమణి తెలిపారు. ఒకవేళ, ఇరుకైన వీధి గుండా ప్రయాణించడం అనివార్యమైన సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ ఈ ఇరుకైన మార్గాలను హైలైట్ చేస్తూ వినియోగదారులకు స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది’’ అని తెలిపారు.
మొదట 8 నగరాల్లో..
తొలుత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా ఎనిమిది నగరాల్లో గూగుల్ (Google) ప్రారంభించిన ఈ ఫీచర్ పట్టణ ప్రాంతాల్లో డ్రైవింగ్ అనుభవాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, గూగుల్ భారతదేశంలోని 40 నగరాల్లో ఫ్లైఓవర్ గైడెన్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇది వినియోగదారులకు వారి మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ల గురించి హెచ్చరికలను అందిస్తుంది.