తెలుగు న్యూస్  /  బిజినెస్  /  స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ దూకుడు.. రెవెన్యూలో 33 శాతం వృద్ధి

స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ దూకుడు.. రెవెన్యూలో 33 శాతం వృద్ధి

Published Feb 12, 2025 04:42 PM IST

google News
    • స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SGLTL) లిస్టింగ్ తర్వాత తొలి త్రైమాసిక ఫలితాలు నివేదించింది. గత తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 454.93 కోట్ల ఆదాయం ఆర్జించింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం (PTI)

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం

స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SGLTL) తమ లిస్టింగ్ తర్వాత తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 454.93 కోట్ల ఆదాయం ఆర్జించింది.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 33% వృద్ధిని సూచిస్తోంది. అంతేకాకుండా EBITDA 42% పెరిగి రూ. 91.37 కోట్లకు చేరుకుంది. పన్ను చెల్లించకముందు లాభం (PBT) 46% వృద్ధితో రూ. 71.30 కోట్లుగా నమోదైంది. పన్ను తర్వాత లాభం (PAT) కూడా 45% పెరిగి రూ. 52.15 కోట్లకు చేరింది. పండుగల సీజన్ కారణంగా కొంత స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, SGLTL 9 నెలల ఫలితాలు బలంగా ఉన్నాయి.

కొత్త ఉత్పత్తుల విడుదల

ఈ సందర్భంగా కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడే షెల్ అండ్ ట్యూబ్ గ్లాస్-లైన్డ్ హీట్ ఎక్స్ఛేంజర్‌లను కంపెనీ విడుదల చేసింది. ఇవి కార్యాచరణ విశ్వసనీయతను గణనీయంగా మెరుగుపరుస్తాయని కంపెనీ తెలిపింది.

అధిక వాహకత గల గ్లాస్-లైన్డ్ రియాక్టర్లు, తక్కువ లీచింగ్, అధిక క్షయ నిరోధకత గల రియాక్టర్లు, అధునాతన PTFE-లైన్డ్ పరికరాలు, కాంపోనెంట్లను కూడా SGLTL విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు భారతీయ పరిశ్రమలో కొత్త మార్పులు తీసుకొస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇటీవల విజయవంతంగా IPO నిర్వహించిన SGLTL రూ. 210 కోట్లు సమీకరించింది. ఈ నిధులతో కంపెనీ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయనుంది. ఇప్పటికే S2 యూనిట్ 5 (100,000 చదరపు అడుగులు) ను స్వంతం చేసుకున్న కంపెనీ, త్వరలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అంతేకాకుండా, USAలో కొత్త సబ్సిడరీ స్థాపించేందుకు కూడా చర్యలు చేపడుతోంది.

ఎండీ స్పందన ఇదీ

"ఇది మాకు చారిత్రాత్మక సమయం. IPO తర్వాత మేము మొదటి ఫలితాలను ప్రకటిస్తున్నాం. పెట్టుబడిదారుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. మేం బలమైన వృద్ధిని సాధించాం" అని SGLTL MD నాగేశ్వర రావు కందుల అన్నారు.

"కొత్త ఉత్పత్తులతో మేము భారతదేశంలో రూ. 2,000 కోట్ల అవకాశాన్ని సృష్టించగలమని నమ్ముతున్నాం" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జపాన్‌కు చెందిన AGI సంస్థతో కలిసి SGLTL కొత్త టెక్నాలజీలను భారతదేశానికి తీసుకొస్తోంది. ఈ సంస్థ ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలకు పరికరాలను తయారు చేసే ప్రముఖ సంస్థలలో ఒకటి.

తదుపరి వ్యాసం