Equity vs Gold: ఈ దీపావళికి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్?.. షేర్స్ కొనాలా? లేక గోల్డ్ కొనాలా?.. నిపుణుల సూచనలు ఇవే..
08 November 2023, 18:17 IST
Equity vs Gold: చాలా మందికి దీపావళి పండుగ సందర్భంగా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దీపావళికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదా? లేక బంగారం కొనడం బెటరా? అన్న మీమాంస చాలామందిలో నెలకొని ఉన్నది.
ప్రతీకాత్మక చిత్రం
Equity vs Gold: ఈ దీపావళి పండుగకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలా? లేక బంగారం కొనాలా? అన్న సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. వారి కోసం ఆర్థిక వ్యవహారాల నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బంగారం సంప్రదాయ ఎంపిక చాలా మంది వ్యక్తులు బంగారం కంటే మెరుగైన రాబడి కోసం స్టాక్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ మెంట్, బంగారం కొనుగోలు.. రెండూ కూడా తెలివైన పెట్టుబడి విధానాలే. కానీ ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ప్రశ్న చాలా మందికి వస్తోంది.
గత పదేళ్లలో..
గత 10 సంవత్సరాలలో ఈక్విటీ మార్కెట్, గోల్డ్ రేట్ లలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2013లో రూ. 29,600 గా ఉంది. ప్రస్తుతం ఆ ధర రూ. 62,480 కి పెరిగింది. అంటే, ఇది 111 శాతం భారీ రాబడిని సాధించింది. ఇదిలా ఉండగా, బెంచ్‌మార్క్ నిఫ్టీ అక్టోబర్ 2013లో 6,299 స్థాయిలో ఉండగా, ఇప్పుడు 19,406.70కి పెరిగింది. అంటే, 200 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. అయితే, బంగారం కంటే ఈక్విటీ పెట్టబడుల్లో ఎక్కువ రిస్క్ ఉంటుందని గమనించడం ముఖ్యం.
షేర్స్ బెటర్
‘‘భారత ఈక్విటీ మార్కెట్ల ఔట్ లుక్ సానుకూలంగా ఉంది. రాబోయే నెలల్లో బంగారం మరియు ఈక్విటీలు రెండూ మంచి పనితీరును కనబరుస్తాయి. 2024లో USలో ఊహించిన ఆర్థిక మందగమనం వల్ల బంగారం ధర మరింత పెరగవచ్చు. అయినా భారతీయ ఈక్విటీలే ఇప్పుడు మెరుగైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. భారతీయ ఈక్విటీ మార్కెట్లు కేవలం బంగారమే కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లను కూడా అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాయి’’ అని స్వస్తిక ఇన్వెస్ట్ మెంట్ ఎంటీ సునీల్ న్యాటి వివరించారు. ‘‘వివిధ అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇటీవల బంగారం ధరలు పెరిగాయి. సాధారణంగా, బంగారం ధర వేగంగా పెరిగినప్పుడల్లా, ఆ తరువాత కొంత విరామం, మరికొంత కరెక్షన్ ఉంటుంది. నా ఉద్దేశంలో రానున్న సంవత్సర కాలంలో బంగారం కన్నా ఈక్విటీ మెరుగైన రాబడిని ఇచ్చే అవకాశం ఉంది’’ అని ప్రొస్టాక్స్ సీఈఓ ఎస్పీ తోష్ణివల్ తెలిపారు.
బంగారం బెటర్
మరోవైపు, మరికొంత మంది మార్కెట్ నిపుణులు ఈక్విటీల కన్నా బంగారం బెటరని సూచిస్తున్నారు. బంగారం పై పెట్టే పెట్టుబడులకు రిస్క్ సమస్య ఉండదని వివరిస్తున్నారు. ‘‘ స్టాక్ మార్కెట్ తక్కువ కాల వ్యవధిలో అధిక రాబడిని అందిస్తుంది. కానీ అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో అధిక నష్టాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. బంగారం రిస్క్ లేని, కచ్చితమైన రిటర్న్స్ ను ఇచ్చే పెట్టుబడి సాధనం’’ అని ఆనంద్ రాఠీలో కమాడటీస్, కరెన్సీస్ డైరెక్టర్ గా ఉన్న నవీన్ మాథుర్ వివరించారు. ‘‘మిడిల్ ఈస్ట్‌లో తాజా ఘర్షణల తర్వాత అక్టోబర్ ప్రారంభం నుండి బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $2090 దాటిన తర్వాత, భారత్ లో బంగారం ధరలో మరింత వృద్ధి కనిపిస్తుంది. 2024 మొదటి అర్ధభాగంలో, ఈక్విటీ లు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ, ఆ తర్వాత రాబడి పరంగా ఈక్విటీలను బంగారం అధిగమించవచ్చు’’ అని ఆనంద్ రాఠీలో రీటైల్ రిసెర్చ్ హెడ్ గా ఉన్న దీపక్ జసానీ అంచనా వేశారు.
సూచన: ఇది నిపుణుల అభిప్రాయాలతో రూపొందించిన కథనం. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణ, పరిశోధనతో పెట్టుబడులు పెట్టడం సముచితం.