తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ducati Bikes : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 కొత్త బైక్ మోడల్స్‌తో మార్కెట్‌లోకి వస్తున్న డుకాటీ

Ducati Bikes : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 కొత్త బైక్ మోడల్స్‌తో మార్కెట్‌లోకి వస్తున్న డుకాటీ

Anand Sai HT Telugu

06 January 2025, 21:00 IST

google News
    • Ducati Bikes : డుకాటీ కంపెనీ.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 కొత్త ద్విచక్ర వాహనాల మోడళ్లను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. దీంతో 2025 కూడా భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ పండగ చేసుకోనుంది.
డుకాటీ నుంచి రానున్న 14 కొత్త మోడళ్లు
డుకాటీ నుంచి రానున్న 14 కొత్త మోడళ్లు

డుకాటీ నుంచి రానున్న 14 కొత్త మోడళ్లు

డుకాటీ భారత మార్కెట్లోకి 14 కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో 9 కొత్త మోడల్స్, 5 లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు ఉంటాయి. డుకాటీ భారతదేశంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తుంది. మరింత మంది కస్టమర్‌లను ఆకర్శించడానికి దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ప్రీమియం డీలర్‌లను తీసుకురావాలని చూస్తోంది.

ప్రస్తుతానికి కొన్ని మోడళ్ల పేర్లు మాత్రమే ప్రకటించారు. 2025 మొదటి త్రైమాసికంలో డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ, సరికొత్త 7వ తరం పానిగేల్ V4ని విడుదల చేస్తుంది. రెండో త్రైమాసికంలో పానిగేల్ V2 ఫైనల్ ఎడిషన్, 2వ జనరేషన్ స్క్రాంబ్లర్ డార్క్‌ను విడుదల చేస్తారు. మూడో త్రైమాసికంలో స్ట్రీట్‌ఫైటర్ V4, స్ట్రీట్‌ఫైటర్ V2, పానిగేల్ V2లతో పాటు మల్టీస్ట్రాడా V2, స్క్రాంబ్లర్ రిజోమాలను విడుదల చేయనుంది కంపెనీ.

భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో ఈ కొత్త మోడళ్ల సందడి చేయనున్నాయి. ఈ కంపెనీకి చెందిన టూ వీలర్స్ ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలో మిగిలిన బైక్ మోడళ్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని అప్‌డేట్ వెర్షన్ కాగా మరికొన్ని కొత్త మోడళ్లు ఉంటాయి.

5 మోటార్ సైకిల్ మోడళ్లను లిమిటెడ్ ఎడిషన్‌లుగా విక్రయించనున్నట్లు డుకాటీ ప్రకటించింది. ఇది పానిగేల్ V2 ఫైనల్ ఎడిషన్, పానిగేల్ V4 ట్రైకలర్ ఇటాలియా, పానిగేల్ V4 ట్రైకలర్, స్క్రాంబ్లర్ రిజోమా వంటి ప్రత్యేక ఎడిషన్‌లను ప్రారంభించాలని భావిస్తున్నారు. దీనితో పాటు ఐదో మోడల్‌గా మరో స్పెషల్ ఎడిషన్ బైక్ మోడల్‌ను విడుదల చేయనున్నారు.

డుకాటీ కంపెనీ కొత్త బైక్ మోడళ్లను ఇంత పెద్ద సంఖ్యలో అమ్మకానికి తీసుకురావడమే కాకుండా.. తన విక్రయ కేంద్రాలను కూడా విస్తరిస్తోంది. 2025లో భారతదేశంలో డుకాటీకి చాలా ఎక్కువ ఆదరణ లభిస్తుందని కంపెనీ అనుకుంటోంది. 2025కి గానూ కంపెనీ మొదటి లాంచ్ ఈ నెల రెండో వారంలో జరగనుందని వెల్లడించారు.

డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ.. '2025 డుకాటీకి చాలా గొప్ప సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త లాంచ్‌లతో ముందుకు వస్తున్నాం. భారతీయ మార్కెట్లో అత్యంత అధునాతనమైన, మంచి పనితీరుతో నడిచే మోటార్‌సైకిళ్లను అందించాలనే మా లక్ష్యం గతంలో కంటే బలంగా ఉంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లను పరిచయం చేయడానికి వెయిట్ చేస్తున్నాం. డుకాటీకి అత్యంత విజయవంతమైన సంవత్సరం అవుతుందని భావిస్తున్నాం.' అని చెప్పారు.

తదుపరి వ్యాసం