Fire in electric vehicle : రోజుకో ఈవీలో అగ్ని ప్రమాదం- ఏం చేస్తే సేఫ్‌గా ఉంటాము? ఇవి తెలుసుకోండి..
09 December 2024, 13:35 IST
- Electric vehicle fire : ఎలక్ట్రిక్ వాహనాలకు అగ్ని ప్రమాదం ఘటనలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీలకు మంటలు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న వివరాలను, టిప్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..
ఈవీలో మంటలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవడం కొత్తేమీ కాదు! వాస్తవానికి ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు మరింత పెరిగాయి. వీటిపై కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొదరు, తీవ్ర నిరాశతో తమ ఈవీలను కాల్చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ శంభాజీ నగర్లో ఒక బజాజ్ చేతక్ ఈవీకి మంటలు అంటుకున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌లో మంటలు చెలరేగడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. బజాజ్ ఆటో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వెల్లువెత్తుతున్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. అందుకే ఒక కస్టమర్‌గా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈవీలో మంటలకు గల కారణాలు తెలుసుకోవాలి. మీ ఎలక్ట్రిక్ వాహనం అగ్నికి ఆహుతవకుండా ఉండటానికి మీరు అనుసరించాల్సిన కొన్ని సరళమైన, ఉపయోగకరమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోండి..
ఛార్జింగ్ చేయడానికి ముందు ఈవీ కూల్ అవ్వాలి!
ప్రయాణాన్ని ముగించిన వెంటనే ఛార్జింగ్ కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్లగ్ చేయడం సరైనది కాదు. ఎందుకంటే ట్రిప్ నుంచి తిరిగి వచ్చే ఈవీ బ్యాటరీలో లిథియం-అయాన్ కణాలు ఇప్పటికీ వేడిగా ఉంటాయి. ప్రయాణాన్ని ముగించిన తర్వాత, ఛార్జింగ్ కోసం ప్లగ్ చేయడానికి ముందు బ్యాటరీ కొంచెమైనా కూల్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు మంటలు అంటుకోకుండా ఉంటాయి.
వేడికి గురికాకుండా చూసుకోండి..
హీట్‌కి దూరంగా ఉండటం అనేది ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ రిస్క్‌లను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి! సూర్యరశ్మిలో ఈవీలు ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే సూర్యకిరణాల నుంచి వెలువడే వేడి ఎక్సోథర్మిక్ రియాక్షన్‌ని ప్రేరేపిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం లోపల వేడిని పెంచుతుంది. అందువల్ల, ప్రత్యక్ష సూర్యకాంతిలో ఈవీని పార్కింగ్ చేయకుండా ఉండటం బెటర్.
నీడ- సరైన వెంటిలేషన్‌లో ఛార్జింగ్..
ఛార్జ్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనంలోని లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ వేడెక్కుతుంది. తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో ఈవీని ఛార్జ్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇది కొన్ని బ్యాటరీ కణాల్లో వెంటింగ్, స్వెల్లింగ్కి దారితీస్తుంది. అందువల్ల, ఈవీని నీడ ఉన్న ప్రదేశంలో ఛార్జ్ చేయాలని, ఛార్జింగ్ ప్రాంతంలో సరైన వెంటిలేషన్ ఉండాలని సిఫార్సు చేస్తుంటారు.
డ్రైవింగ్ అలవాట్లు ముఖ్యం..
డ్రైవర్ డ్రైవింగ్ అలవాట్లు ఇంధన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా వాహన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కఠినమైన భూభాగాలపై వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ ప్యాక్‌పై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువుపై డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ ప్యాక్ దెబ్బతింటుంది. మీకు ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నంత మాత్రాన మీరు దానిని ఆఫ్‌రోడింగ్ కోసం తీసుకోవచ్చని కాదు!
నిజమైన ఓఈఎం అందించిన ఛార్జర్లను ఉపయోగించండి..
ఎలక్ట్రిక్ వాహనం థర్మల్ ప్రొటెక్షన్‌ని ధృవీకరించడంలో సరైన ఛార్జర్‌ను ఉపయోగించడం ఒక కీలకమైన అంశం! ఆఫ్టర్ మార్కెట్ నుంచి ఈవీ ఛార్జర్ కొనడం ప్రమాదకం! ఎందుకంటే ఇది మీ ఎలక్ట్రిక్ వాహనంతో పనిచేసేంత అనుకూలంగా, సురక్షితంగా ఉండకపోవచ్చు. అందువల్ల, ఓఈఎంలు ఇచ్చే ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తుంటారు.
డ్రైన్ చేయడం లేదా ఓవర్ ఛార్జింగ్ చేయడం మానుకోండి..
ఎలక్ట్రిక్ వెహికల్లో అత్యంత ముఖ్యమైన కాంపోనెంట్ బ్యాటరీ ప్యాక్. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో చాలా మంటలు బ్యాటరీల నుంచి ఉద్భవిస్తాయి. ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థాయి 20 నుంచి 80 శాతం మధ్యలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీ ఛార్జ్ లెవల్ పూర్తిగా ఖాళీ కాకుండా చూసుకోవాలి. అలాగే ఓవర్ ఛార్జ్ కూడా చేయకూడదు.