Apple store India : భారత్‌లో తొలి యాపిల్ స్టోర్.. డోర్ తెరిచి కస్టమర్లకు స్వాగతం పలికిన సీఈఓ!
18 April 2023, 11:55 IST
- Apple store India : దేశంలోనే తొలి యాపిల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. డోర్స్ ఓపెన్ చేసి కస్టమర్లకు స్వాగతం పలికారు.
ముంబైలోని యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సీఈఓ టిమ్ కుక్
Apple store India : ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన కీలక ఘట్టానికి తెరపడింది! దేశంలోనే తొలి యాపిల్ రీటైల్ స్టోర్ మంగళవారం ప్రారంభమైంది. ముంబైలోని ఈ స్టోర్‌ను.. యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. స్వయంగా డోర్స్ ఓపెన్ చేసి కస్టమర్లకు స్వాగతం పలికారు.
ఆసియాలో మార్కెట్‌ను పెంచుకునేందుకు యాపిల్ సంస్థ ఇటీవలి కాలంలో కృషిచేస్తోంది. ముఖ్యంగా.. తమ వ్యాపారాలను చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను టిమ్ కుక్ లాంచ్ చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. దేశంలో వ్యాపార విస్తరణకు ఇది కీలక ఘట్టమని పేర్కొంది యాపిల్ సంస్థ. ఇండియాలో 2020లోనే తొలి ఆన్లైన్ స్టోర్‌ని ప్రారంభించిన యాపిల్‌కు.. రీటైల్ స్టోర్‌ను తీసుకొచ్చేందుకు ఇంత సమయం పట్టింది. ఇక రెండో రీటైల్ స్టోర్ గురువారం ఢిల్లీలో ఓపెన్కానుంది.
ఫ్యాన్స్‌లో క్రేజ్.. మామూలుగా లేదుగా..!
Apple BKC Mumbai : ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఉంది ఈ యాపిల్ రీటైల్ స్టోర్. ఐఫోన్ ప్రేమికులు భారీ సంఖ్యలో గుమిగూడి.. ఈ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. భారీ క్యూలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కొందరైతే ఏకంగా అర్ధరాత్రి నుంచే యాపిల్ స్టోర్ బయట పడిగాపులుగాచినట్టు తెలుస్తోంది. టిమ్ కుక్‌ను కలవాలని, యాపిల్ రీటైల్ స్టోర్‌ను చూడాలని వీరందరు చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టు సమాచారం.
"ఇక్కడి వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. సాధారణ రీటైల్ స్టోర్ నుంచి వస్తువులు కొనుక్కున్న ఫీలింగ్ కాదు ఇది. ఇది ప్రత్యేకం! అసలు పోలీకే లేదు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది," అని 23ఏళ్ల ఆన్ షాహ్ మీడియాతో తెలిపారు. ఇతను అహ్మదాబాద్ నుంచి ముంబైకి వచ్చాడు.
ముంబైలో యాపిల్ రీటైల్ స్టోర్.. విశేషాలివే!
Apple retail store in India : ఇండియాలో ఐఫోన్ ఉత్పత్తులు అడుగుపెట్టిన 25వసంతాలు గడుస్తోంది. ఇదే సమయంలో యాపిల్ తొలి రీటైల్ స్టోర్ ఓపెన్ అవ్వడం ప్రత్యేకం.
లాంచ్‌కి ముందు రోజు.. అంటే సోమవారం, వివిధ బ్లాగర్స్, టెక్ రివ్యూవర్స్‌ను స్టోర్ లోపలికి తీసుకెళ్లింది యాపిల్. వాళ్లందరు రివ్యూలు చేసేశారు.
Apple India latest news : 2016లో తొలిసారి ఇండియాకు వచ్చారు టిమ్ కిక్. రీటైల్ స్టోర్ ఓపెనింగ్ కోసం.. మళ్లీ 7ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడాపావ్ కూడా తిన్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇండియా ప్రజల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఈ యాపిల్ స్టోర్‌లో పలు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
Tim Cook in India : యాపిల్ బీకేసీలోని 100మంది సిబ్బంది.. 18 భారతీయ భాషల్లో మాట్లాడగలరు. ఇండియాలో 2500మందికి ఉద్యోగాలిచ్చినట్టు, యాప్ ఎకో సిస్టెమ్ ద్వారా 10లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్టు యాపిల్ చెబుతోంది.
యాపిల్ స్టోర్‌కు సమీపంలో.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్‌తో పాటు పలు ఇతర బ్రాండ్స్ యాడ్లు కూడా వేయలేవు. ఇంత పక్కాగా ప్లాన్ వేసింది యాపిల్ సంస్థ.
Apple BKC store launch :మొత్తం 20వేల చదరుపు అడుగుల్లో ఉంది ఈ రీటైల్ స్టోర్. దీని రెంట్ నెలకు రూ. 42లక్షలు! వార్షికంగా 15శాతం పెరుగుతూ ఉంటుంది. వచ్చే మూడేళ్ల వరకు సంస్థ తన ఆదాయంలో 2శాతాన్ని ప్రాపర్టీ ఓనర్స్‌తో పంచుకోనుంది.