8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు ఇప్పట్లో లేనట్టే! 2027 చివరి వరకు ఆగక తప్పదా?
Published Oct 13, 2025 11:17 AM IST
- 8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు ఇప్పట్లో లేనట్టే! 8వ వేతన సంఘంలోని కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తున్న తరుణంలో, మొత్తం ప్రక్రియే ఆలస్యమవుతోంది. ఇది నివేదిక టైమ్‌లైన్‌పై ప్రభావం చూపించనుంది. ఫలితంగా జీతాల పెంపు ఆలస్యమవ్వొచ్చు.
ఉద్యోగుల జీతాల పెంపు ఇప్పట్లో లేనట్టే?
కోటి 20 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, భత్యాలను సవరించడానికి ఉద్దేశించిన 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ఇంకా అధికారికంగా జరగలేదు! కేంద్ర కేబినెట్ జనవరి 2025లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఈ కమిషన్ పని ముందుకు సాగడంలో కీలకమైన రెండు అంశాలపై ఇంకా క్లారిటీ లేదు! అవి.. ఛైర్మన్ నియామకం, నిబంధనలు, షరతుల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ -టీఓఆర్) ఖరారు.
ఈ రెండు లేకపోవడంతో, కమిషన్ తన పనిని ప్రారంభించలేకపోతోంది. దీనివల్ల మొత్తం వేతన సవరణ ప్రక్రియ నిర్ణీత సమయం కంటే బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది!
టీఓఆర్ అనేవి కమిషన్ పరిధిని, వేతన స్కేల్‌లు, భత్యాల స్ట్రక్చర్, పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు అన్ని ఇతర అంశాలను నిర్వచించే ముఖ్యమైన పత్రం. గతంలో.. 7వ వేతన సంఘం సెప్టెంబర్ 2013లో ప్రకటించిన తర్వాత, కొద్ది నెలల్లోనే (ఫిబ్రవరి 2014 నాటికి) ఛైర్మన్, టీఓఆర్ రెండూ నోటిఫై అయ్యాయి. కానీ, ప్రస్తుత ప్రక్రియలో ఆ వేగం కనిపించడం లేదు.
వేతన సవరణ అమలుకు సంబంధించిన అంచనా సమయం..
సాంప్రదాయకంగా, వేతన సంఘాల సిఫార్సులు అమల్లోకి రావడానికి, అవి ఏర్పడినప్పటి నుంచి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది! 8వ వేతన సంఘం పని ఇంకా ప్రారంభం కాకపోవడంతో, 2027 మధ్య నాటికి లేదా 2028 ప్రారంభం కంటే ముందు జీతాల సవరణ జరగడం అసంభవంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు, 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 2014లో స్థాపించారు. నవంబర్ 2015 నాటికి ఈ సంఘం తన నివేదికను సమర్పించింది. సిఫార్సులు 2016లో అమల్లోకి వచ్చాయి. ఇదే లెక్కన.. ఒకవేళ 8వ వేతన సంఘం కమిషన్ 2026 ప్రారంభంలో పని మొదలుపెట్టినా, తుది నివేదిక 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొన్ని నెలల తర్వాత అది అమల్లోకి వస్తుంది. ఇదే నిజమైతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది.
ఎవరికి ప్రయోజనం? ఏం ఆశించవచ్చు?
ప్రయోజనం పొందేది: 8వ వేతన సంఘం పని మొదలుపెట్టిన తర్వాత, సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, రక్షణ సిబ్బందితో సహా 65 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, భత్యాలను సమీక్షిస్తుంది.
డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ): ద్రవ్యోల్బణం రేట్లకు అనుగుణంగా కరువు భత్యం (డీఏ) సర్దుబాటుపై కూడా 8వ వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. సాంప్రదాయకంగా, ఈ మార్పులు అమలు చేసిన సంవత్సరంలో జనవరి 1 నుంచి వర్తించేలా బ్యాక్‌డేట్ చేస్తారు.
ప్రస్తుతం జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ తదుపరి వేతన సవరణ కోసం దీర్ఘకాలం వేచి ఉండక తప్పదు అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
టాపిక్
