YS Sharmila : 'విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది... జగన్ క్యారెక్టర్ సున్నా' - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Published Feb 07, 2025 09:36 PM IST
- వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలపై స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు విని చాలా బాధ వేసిందన్నారు.
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రెడిబులిటి ఖాలీ బాటిల్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ క్రెడిబులిటి సున్నా అని… సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తులు కాజేయ్యలని కుట్రలు చేశాడని ఆరోపించారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని దుయ్యబట్టారు.
సాయిరెడ్డితో బలవంతంగా చెప్పించారు…
“ విజయసాయిరెడ్డి తో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారు. నా బిడ్డలకు సంబంధించిన ఒక విషయం చెప్తున్నాను. జగన్ గారు సొంత తల్లి మీద కేసు పెట్టించారు. ఆ కుట్రను నేను బయట పెట్టా. నేను నిజాలు చెప్పాను అని జగన్ నా మీద అబద్ధాలు చెప్పాలని సాయి రెడ్డికి చెప్పాడు. సాయి రెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారు. స్వయంగా సాయి రెడ్డికి జగన్ కాల్ చేశాడు. ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశారు. కుదరదు అని సాయి రెడ్డి చెప్తే జగన్ ఒప్పుకోలేదు” అని షర్మిల సంచలన విషయాలు చెప్పారు.
ఇంతలా దిగజారాలా…? వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉంది అని సాయి రెడ్డి చెప్పాడని షర్మిల గుర్తు చేశారు. "నన్ను వదిలేయమని సాయి రెడ్డి వేడుకొంటే సుబ్బారెడ్డి తో మాట్లాడించారు. సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ సాయి రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టంలేదు అని సాయి రెడ్డి వేడుకున్నా వదిలి పెట్టలేదు. ఈ విషయం స్వయంగా సాయిరెడ్డి చెప్పారు. సాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలు అన్ని స్వయంగా జగన్ నోట్ ఇచ్చారు. 40 నిమిషాల పాటు జగన్ చెప్తుంటే నోట్ చేసుకున్నాడు. జగన్ నైజం ఇదే అని సాయి రెడ్డి అర్థం చేసుకున్నారు. సాయి రెడ్డి చెప్తుంటే చాలా బాధ వేసింది. జగన్ ఇంతలా దిగజారాలా..? అని షర్మిల ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కొడుకు అయ్యి ఉండి క్యారెక్టర్ దిగజారాలా? క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్ మీద డైలాగ్ లు చెప్తున్నాడు.క్యారెక్టర్ అనే పదం అర్థం కూడా జగన్ కి తెలియదు. మీ క్యారెక్టర్ ఏంటో మీరే ఆలోచన చేయాలి. సాయిరెడ్డి వదిలేయమని బ్రతిమిలాడితే ఒత్తిడి చేయడం మీకు క్యారెక్టర్ ఉన్నట్లా..? వైఎస్ఆర్ కుటుంభం పరువు తీయొద్దు అని వేడుకుంటే అబద్ధాలు చెప్పించిన మీకు క్యారెక్టర్ ఉన్నట్లా…? మీరే స్వయంగా అబద్ధాలు రాసి ఇవ్వడం క్యారెక్టర్ ఉన్నట్లా..? మీరు చేసిన కుట్రలు ఏంటో ఆత్మ పరిశీలన చేస్కోండి" అంటూ షర్మిల హితవు పలికారు.
“జగన్ గారు మీరు సాయిరెడ్డి చేత అబద్ధాలు చెప్పించలేదా? ప్రజలను అవే నిజాలు అని నమ్మించ లేదా..? సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టలేదా ? ఆస్తికోసం ఏదైనా చేయొచ్చు అనుకోలేదా..? సొంత చెల్లికి మీరు వెన్నుపోటు పొడిచిన..మీకు క్రిడిబులిటి ఉందా..? వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ మీరు. జగన్ కి క్రిడిబుల్టి మిగిలి లేదు. సొంత చిన్నాన్నను హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే పోయింది మీ విశ్వసనీయత. ఆస్తులు కాజేయాలని చూసినప్పుడే పోయింది విశ్వసనీయత. జగన్ కి ఉన్నది క్రేడిబులిటి కాదు... డబ్బుంది అనే అహంకారం” అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.