YS Jagan Comments : రాబోయేది వైసీపీ 2.0 పాలనే... ఎవర్నీ వదిలిపెట్టం - వైఎస్ జగన్
Published Feb 12, 2025 04:31 PM IST
- చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. అమలు చేస్తానన్న పథకాలన్నీ అబద్ధం, మోసమని ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. వచ్చేది జగన్ 2.0 పాలనే అని పునరుద్ఘాటించారు. కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినవారిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ 2.0 పాలనే అని ఉద్ఘాటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన జగన్… చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అమలు చేస్తానన్న పథకాలన్నీ అబద్ధం, మోసమని విమర్శించారు. జగన్ అబద్దాలు చెప్పలేడు కాబట్టే 2024లో వైసీపీ ఓడిపోయిందన్నారు.
కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తారు….
ఇప్పటికే ప్రజలు హామీలు గురించి ప్రశ్నిస్తున్నారని జగన్ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలోని నేతలను కాలర్ కూడా పట్టుకుని ప్రశ్నిస్తారని చెప్పుకొచ్చారు.
“రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడం లేదు. ప్రజలు కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఏమీ జరగడంలేదు. ఇసుక, లిక్కర్ స్కామ్‌లు చేస్తున్నారు. విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టాలి. మన పాలనలో రెండున్నర ఏళ్లు కోవిడ్ ఉంది.. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం” అని వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు.
వచ్చేది మన పాలనే….
వచ్చేది జగన్ 2.0 పాలనే అని జగన్ పునరుద్ఘాటించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలను ఇబ్బందిపెట్టిన ఏ ఒక్కర్నీ వదలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారందర్నీ కూడా చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
కూటమి సర్కార్ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తోన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అక్రమ కేసులకు ఎవరు భయపడొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే వైసీపీ పాలనలో రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులు ఎవరిని వదిలిపెట్టమన్నారు.