AP Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన వైసీపీ
07 November 2024, 14:02 IST
- AP Mlc Elections: కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించిన వైసీపీ
AP Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. కృష్ణా-గుంటూరు,ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో జరిగే ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేనందున ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు కనపడటం లేదని ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేనట్టుగా ఉందని వైసీపీ ఆరోపించింది.
వైసీపీ నేతల్ని, పాకిస్థాన్ తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని గమనించామని, డిప్యూటీ సీఎం పవన్ కొంతకాలంగా పోలీసు వ్యవస్థ అచేతనంగా మారిపోయిందని వ్యాఖ్యానించారని, తన మాటలు ఎవరు పాటించటం లేదని, ప్రభుత్వానికి రాజకీయ నాయకుల వేధింపులే ప్రధాన లక్ష్యంగా ఉందని వైసీపీ ఆరోపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని వైసీపీ పార్టీ నాయకులు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు 41A నోటీసులు ఇచ్చి, వాటిని పరిగణనలో తీసుకోకుండా అరెస్టు చేస్తున్నారని వైసీపీ జెండా పట్టుకున్నా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.
వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టినా, వారిని కోర్టులో హాజరుపరచడం లేదని తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వారిని కొడుతున్నారని వైసీపీ ఆరోపించింది. . కానీ, ప్రభుత్వంలో ఒక్కో మంత్రి కూడా శాంతిభద్రతల గురించి చర్చించటం లేదు. అంతా కేవలం వైసీపీ నేతలను ఎలా ఇబ్బందిపడ్చాలనే దానిపైనే చర్చలు సాగిస్తున్నాయి.
మా కార్యకర్తలను కనిపించకుండా తీసుకెళ్ళి, వారిపై వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని పోలీసు అధికారులకు గుర్తుచేస్తున్నాం.
ఏపీలో పాలన పూర్తిగా కుప్పకూలిపోయిందని వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని పోలీసు వ్యవస్థ పూర్తిగా టీడీపీ గుప్పెట్లో ఉందని పేర్నిన నాని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దయనీయంగా ఉన్నాయని ఆరోపించారు. అప్రజాస్వామికంగా పోలీసులు అడ్డుపెట్టి రాజకీయ నాయకుల్ని వేధింపులతో హింసిస్తున్నందున త్వరలో జరిగే ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.