తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan On Cbn: సూపర్‌ సిక్స్‌ ఎక్కడ.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందన్న వైఎస్ జగన్

Ys Jagan On CBN: సూపర్‌ సిక్స్‌ ఎక్కడ.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందన్న వైఎస్ జగన్

Published Feb 06, 2025 12:01 PM IST

google News
    • Ys Jagan On CBN: చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పినా జనం వినలేదని,   బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ నిండా ముంచారని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని తొమ్మిది నెలల్లో రుజువైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. 
బాబూ ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటున్న జగన్

బాబూ ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటున్న జగన్

Ys Jagan On CBN: ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఎన్నికల వేళ ముసలామె కూడా బటన్‌ నొక్కుతుందని,అదేమైనా గొప్ప విషయమా అన్నారని.. అంతటితో సూపర్‌ సిక్స్‌ అంటూ మ్యానిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల్ని పంపినపుడు చెప్పిన మాటలు ఎవరు మర్చిపోలేదన్నారు.

పిల్లలకు 15వేలు, పెద్దలకు 18వేలు అంటూ మహిళల్ని మోసం చేశారని, 50ఏళ్లు నిండితే వారికి 48వేలు ఇస్తామన్నారని, రైతులకు రూ.20వేలు, యువతకు డబ్బులిస్తామని మోసం చేశారని జగన్ ఆరోపించారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు పంచిపెట్టారని, అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారని గుర్తు చేశారు.

పంచిన పంప్లెట్లు ఏమయ్యాయని, హామీలు ఏమయ్యాయని ఇప్పుడు జనం ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 9నెలల్లో రికార్డు స్థాయికి చేరాయని, గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పులు చేయలేదని, అన్ని రికార్డులు బద్దలు గొట్టారని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి వచ్చే అప్పులే రూ.80,827కోట్లకు చేరాయని ఆరోపించారు.

ఇవి కాకుండా 9 నెలల్లో అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50వేల కోట్లు తీసుకొస్తున్నారని చెప్పారు. అమరావతి కోసం వరల్డ్‌ బ్యాంక్, జర్మనీ, సిఆర్‌డిఏ చేసే అప్పులు చేస్తున్నారని, మార్క్‌ఫెడ్‌, సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ నుంచి రూ.8వేల కోట్లు, ఏపీఎంఎస్‌ఐడిసి తెచ్చి అప్పులతో కలిపి రూ.1.48లక్షల కోట్ల అప్పులు తీసుకు వస్తున్నా సూపర్‌ సిక్స్‌ అమలు చేయలేదన్నారు.

సూపర్‌ సిక్స్‌ హామీలు ఎక్కడ..?

ఇన్ని అప్పులు తెచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల ఎందుకు అమలు చేయడం లేదని, వైసీపీ హయంలో అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించడం లేదని, పిల్లల చదువులకు ఇస్తున్న అమ్మఒడి పోయిందని, రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, ఆరోగ్య శ్రీలను ఎగ్గొట్టారని, వాహన మిత్ర, నేతన్ననేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు వంటి పథకాలను ఎగ్గొట్టారని ఆరోపించారు. పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పథకాలను కూడా మాయం చేశారని, రూ.1.45లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు.

కొత్త ఉద్యోగాల్లేవు… ఉన్నవి పీకేశారు..

కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా 2.60లక్షల వాలంటీర్ ఉద్యోగాలను తొలగించారని, 18వేల మంది బేవరేజీస్ కార్పొరేషన్‌ ఉద్యోగులు రోడ్డున పడ్డారని , ఫైబర్‌ నెట్‌, ఏపీఎండీసీ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిపి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేశారని, గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సచివాలయాల నుంచి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న చోటకు సర్దుబాటు చేస్తున్నారని, ఖాళీలను భర్తీ చేయకుండా కుదిస్తున్నారని ఆరోపించారు.

వాలంటీర్లకు రూ.10వేల జీతం ఇస్తామని మోసం చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 9నెలలైనా ఉద్యోగులకు రుపాయి కూడా ఐఆర్‌ ఇవ్వలేదని, పీఆర్సీ ఛైర్మన్‌ ను రాజీనామా చేయించి కొత్త పీఆర్సీ వేయలేదన్నారు. 9 నెలల్లో ఒక్క నెల మాత్రమే ఒకటో తేదీన జీతం ఇచ్చారని, ట్రావెల్ అలవెన్స్‌, మూడు డిఏలు, మెడికల్ రియింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిఎల్‌ఐ, జిపిఎఫ్‌లు కూడా వాడేసుకుంటున్నారని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు.

తదుపరి వ్యాసం