HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtgs And Sdma: వ్యవస్థలు విఫలమైన వేళ.. బెజవాడను విపత్తు ముంచెత్తింది.. ఆర్టీజీఎస్‌, ఎస్‌డిఎంఏల వైఫల్యం..

RTGS And SDMA: వ్యవస్థలు విఫలమైన వేళ.. బెజవాడను విపత్తు ముంచెత్తింది.. ఆర్టీజీఎస్‌, ఎస్‌డిఎంఏల వైఫల్యం..

04 September 2024, 8:26 IST

    • RTGS And SDMA: దేశంలో మరెక్కడా లేని రియల్‌ టైమ్‌ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పంజాను ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది. ఆర్టీజిఎస్‌, ఎస్‌డిఎంఏలు భారీ వర్షాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తలెత్తే ముప్పు ఎందుకు పసిగట్టలేకపోయాయి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వరదలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వరదలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

వరదలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

RTGS And SDMA: దేశంలో మరెక్కడా లేని రియల్‌ టైమ్‌ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పంజాను ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది. ఆర్టీజిఎస్‌, ఎస్‌డిఎంఏలు భారీ వర్షాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తలెత్తే ముప్పు ఎందుకు పసిగట్టలేకపోయాయి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

RTGS And SDMA: విజయవాడ నగరాన్ని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. పాత రికార్డుల్ని అధిగమించి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో విజయవాడ నగరాన్ని ముంచెత్తనున్న ముప్పును ప్రభుత్వ యంత్రాంగాలు ఎందుకు పసిగట్టలేకపోయాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆగస్టు 30వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరం చిగురుటాకుల వణికింది. 30వ తేదీ శుక్రవారం రాత్రి మొదలైన వర్షం 31వ తేదీ సాయంత్రం వరకు కొనసాగింది. 31వ తేదీ శనివారం తెల్లవారుజాము వరకు విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అదే రోజు విజయవాడలో కొండ చరియలు విరిగి పడ్డాయి.

మొఘల్ రాజ్ పురంలో కొండ చరియలు ఇళ్లు మీద కూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని అపార్ట్మెంట్ లలోకి కూడా నీళ్లు చేరాయి. 31వ తేదీన జాతీయ రహదారులు మొత్తం జల దిగ్భంధం అయ్యాయి. 31వ తేదీ శనివారం అర్థరాత్రికి నగరంలోని ఓ వైపు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించారు.

నగరాన్ని కాపాడిన రైల్వే ట్రాకులు…

అదే సమయంలో ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కొనసాగడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.విజయవాడ నగరంలోని చెన్నై-విశాఖపట్నం రైల్వే ట్రాక్‌కు ఎడమ వైపు ఉన్న ప్రాంతం మొత్తం ముంపుకు గురైంది. ఎన్టీఆర్‌ జిల్లా జి కొండూరు మండలం, ఇబ్రహీం పట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో ప్రవహించే బుడమేరు ఉగ్రరూపం సంతరించుకుంది. కృష్ణానదిలో ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో దిగువకు బుడమేరును మళ్లించే అవకాశం లేకుండా పోయింది.

ఆర్టీజీఎస్‌ ఏమైంది, ఎస్‌డిఎంఏ ఏం చేసింది...

విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వారం ముందే ఐఎండి వీక్లీ బులెటిన్‌ హెచ్చరించింది. 26-27 తేదీల్లో విపత్తుల నిర్వహణ శాఖ వాతావరణ సూచనల్లో భారీ వర్షాలను అంచనా వేశారు. ఆ తర్వాత శాటిలైట్ చిత్రాల ద్వారా వాతావరణాన్ని అంచనా వేసే నిపుణులు విజయవాడలో కుంభవృష్టి కురవొచ్చని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

ఓ వైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ ప్రభుత్వ యంత్రాంగం వరదలపై ఏ మాత్రం సన్నద్దం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలో అత్యాధునిక వ్యవస్థలతో ఆర్టీజీఎస్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ఆర్టీజీఎస్‌ నుంచి మానిటర్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని 2019 నాటికి సమకూర్చుకున్నారు. విపత్తుల సమయంలో ప్రజల్ని అప్రమత్తం పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇక వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల్నినిరంతరం పర్యవేక్షించేందుకు తాడేపల్లిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేశారు. ఐఎండీ అంచనాలు, వరదలు, వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించి అప్రత్తం చేసేలా దీనిని తీర్చిదిద్దారు.

పడకేసిన వ్యవస్థలు...

ఆర్టీజీఎస్‌, ఎస్‌డిఎంఏలను గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అకాల వర్షాలు, పిడుగులు పడబోతున్నాయనే సమాచారం ముందుగానే పసిగట్టి అయా ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ద్వారా ఎమర్జెన్సీ మెసేజీలతో ప్రజల్ని అప్రమత్తం చేసేవారు.

విజయవాడ నగరంపై వరుణుడు కుంభవృష్టి కురిపించిన వేళ ఇవి పనిచేయలేదు. భారీ వర్షాల తర్వాత విజయవాడను బుడమేరు ముంచెత్తబోతుందని అప్రమత్తం చేయడంలో కూడా విపత్తుల నిర్వహణ శాఖ విఫలమైంది. ప్రస్తుతం విపత్తుల నిర్వహణ శాకకు డైరెక్టర్‌‌గా రోణంకి కూర్మనాథ్ ఉన్నారు. బుడమేరు విలయం సృష్టిస్తున్న సమయంలో కనీసం వరద సహాయక చర్యలపై సమాచారం ఇవ్వడంలో కూడా ఇది విఫలమైంది.

శనివారం రాత్రికి విజయవాడలో వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో వెలగలేరు వద్ద బుడమేరుకు డైవర్షన్ ఛానల్‌కు గండి పడటంతో వరద నీరు నగరం మీదకు పోటెత్తింది. ఆదివారం తెల్లవారే సరికి నగరం నగరాన్ని వరద ముంచెత్తింది. వరద నీరు క్రమంగా పెరుగుతున్నా దాని తీవ్రత గురించి ఎవరు ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ప్రభుత్వం నుంచి కనీస హెచ్చరికలు రాకపోవడంతో వర్షపు నీరు ఆగిపోతుందని అంతా ఉదాసీనంగా ఉండిపోయారు. రోడ్లపై వాహనాలు ఉండిపోయాయి. వెరసి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, క్యూఆర్ టీమ్‌లు, రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన సిబ్బంది విజయవాడలో పనిచేస్తున్నారు. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది, వరదలపై తాజా అప్టేట్‌లను కూడా ఎస్‌డిఎంఏ విడుదల చేయలేకపోయింది. ఇక ఆర్టీజిఎస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

చంద్రబాబు మానసపుత్రికగా గుర్తింపు పొందిన రియల్ టైమ్ గవర్నెన్స్‌ వ్యవస్థ విపత్తు వేళ మూగబోయింది. గత ఐదేళ్లలో దానిని పునరావాస కేంద్రంగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీజీఎస్‌ బాధ్యులు ఎవరు, సమాచారం అందించే వారు ఎవరనే దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. వెరసి విపత్తు సమయంలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరి ప్రజల పరిస్థితి తయారైంది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్