తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balinene Issue: బాలినేని బాధేమిటి? అలకలు, బెదిరింపులు, కర్ర పెత్తనం మరో పార్టీలో సాధ్యమేనా?

Balinene Issue: బాలినేని బాధేమిటి? అలకలు, బెదిరింపులు, కర్ర పెత్తనం మరో పార్టీలో సాధ్యమేనా?

19 September 2024, 9:40 IST

google News
    • Balinene Issue: బాలినేని శ్రీనివాసరెడ్డి… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు, వైఎస్సార్‌ బంధువు, మంత్రిగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు  వైసీపీకి రాజీనామా చేశారు.  బాలినేని వ్యవహారం వైసీపీలో కలకలం రేపినా, పార్టీ మారితే పూర్వ వైభవం  సాధ్యమేనా అనే సందేహాలు ఉన్నాయి. 
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి

జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Balineni Politics: ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను తన కనుసన్నల్లో నడిపించిన బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడిపోతానంటూ హడావుడి చేశారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని కోరుకున్నా జగన్ అంగీకరించక పోవడంతో పార్టీని వీడేందుకు అప్పట్లో సిద్ధమయ్యారు. 2022లో మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒంగోలులో పట్టుకోసం వైవీ సుబ్బారెడ్డితో తలెత్తిన విభేదాలు, వారసుల్ని నిలబెట్టుకోడానికి ఇద్దరు నేతలు చేసిన ప్రయత్నాలు జరిగాయి.

ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నించి కూడా బాలినేని భంగపడ్డారు. మాగుంట అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలదు. చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. మాగుంట ఎంపీ అభ్యర్థి అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

25వేల ఇళ్ల పట్టాలు ఇప్పించినా ఫలితం దక్కలేదు..

జగనన్న కాలనీల ఏర్పాటు కోసం balineni ఒంగోలు మండలం ఎర్రజర్ల గ్రామంలో కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసి దాదాపు 50 ఎకరాల్లో ఉన్న కొండను చదును చేయించి ఫ్లాట్లుగా వేశారు. దీని కోసం ప్రభుత్వం నుంచి రూ. 47కోట్లనిధులు శాంక్షన్ చేయించారు. కొండను చదును చేయగా వచ్చిన మట్టిన బినామిలు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్భలతంతో సర్వేరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మైనింగ్ ల్యాండ్‌‌గా నివాస స్థలాలుగా ఇవ్వడం సరికాదని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు అక్కడ నివాసాలు ఏర్పాటు చేయొద్దని స్టే విధించింది. అక్కడ జగనన్న కాలనీలు నిలిచిపోయింది. మళ్లీ భూములు కొనైనా ఇళ్ళ స్థలాలు ఇస్తానని బాలినేని సవాలు చేశారు.

దీని కోసం బాలినేని వైసీపీ అధినేత జగన్‌తో తీవ్ర స్థాయిలో యుద్ధమే చేశారు. జగన్‌ను వెంటాడి, అలిగి ఒప్పించారు. 230కోట్ల వ్యయంతో ప్రైవేట్‌స్థలాలను వెంగముక్కల పాలెం, అగ్రహారం వద్ద భూములు కొనుగోలు చేశారు.ఓ చోట 200 ఎకరాలు, మరో చోట 170 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కొన్నారు. ఎన్నికలకు ముందు సెంటు స్థలం చొప్పున 25వేల మంది పంచారు. గెలుపు కోసం నియోజక వర్గంలో 25వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినా 34వేల ఓట్ల తేడాతో బాలినేని ఓడిపోయాడు.

బాలినేనిదే పెత్తనం….

వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో పార్టీపై బాలినేని పెత్తనం కొనసాగింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దానిని భరించలేక ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఎక్కువైంది.బాలినేనితో మిగిలిన వారు కలిసి రాకపోవడానికి అదే కారణమని చెబుతున్నారు. .

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పెత్తనంతో జిల్లాలో ఉన్న నేతలెవరు తమకు స్వతంత్రత లేదని అప్పట్లో భావించారు. మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పూర్తిగా మంత్రి బాలినేని చెప్పు చేతల్లో ఉండటం వల్ల తమకు గుర్తింపు, ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు భావించారు. చివరకు జిల్లాలో వైసీపీ తుడుచి పెట్టుకుపోయింది.

జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌.. బాలినేని ఉండగా జిల్లాలో మాట్లాడేందుకు సైతం సాహసించని పరిస్థితి ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఇరువురు ఒకేచోట ఉండాల్సిన వచ్చినపుడు ఆయన మౌనంగా ఉండిపోయేవారని చెబుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా, సదరు ఎమ్మెల్యేలు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారైతే, ప్రభుత్వంలో పనుల కోసం వచ్చే వారంతా జిల్లా మంత్రి బాలినేని వద్దకే వెళ్లే వారు.

ఇక కాంట్రాక్టులు, ఇతర పనుల కోసం అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులు పరిగణలోకి తీసుకునే వారు కాదనిఅప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు వాపోయేవారు. పేరుకు మాత్రమే తాము ఎమ్మెల్యేలమనే భావన వారిలో బలంగా ఉండేది.

బాలినేని వర్సెస్‌ వైవి సుబ్బారెడ్డి

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు ఎప్పుడో తారాస్థాయికి చేరుకుంది. టిటిడి ఛైర్మన్‌గా పదవీ కాలం ముగిసిన సమయంలో జిల్లా రాజకీయాల్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించారు.

అప్పట్లో సుబ్బారెడ్డి రాకను మంత్రి బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అవకాశం వస్తే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రికి సైతం తన మనసులో మాటను చెప్పానని వివరించారు. దీంతో బాలినేని వేగంగా పావులు కదిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కకుండా చేశారని ప్రచారం జరిగింది.

ఎన్నికలకు ముందు గన్‌మెన్లు అవసరం లేదని, నకిలీ పట్టాల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు తీరుపై బాలినేని ప్రభుత్వంతో విభేదించారు. స్వయంగా ముఖ్యమంత్రి బుజ్జగించడంతో అప్పట్లో ఆయన పార్టీని వీడే ప్రయత్నాలు విరమించుకున్నారు.తాజాగా వైసీపీ వీడి జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గురువారం జనసేన అధినేతతో బాలినేని భేటీ కానున్నారు. వైసీపీలో సాగినట్టు బాలినేని పెత్తనం మరో పార్టీలో ఎంతవరకు సాధ్యమనే చర్చ కూడా ప్రకాశం నేతల్లో సాగుతోంది.

తదుపరి వ్యాసం