YS Jagan in Vinukonda : ఏపీలో ఆటవిక పాలన సాగుతోంది - దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం - వైఎస్ జగన్
19 July 2024, 18:45 IST
- YS Jagan in Vinukonda : వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు.
వైసీపీ అధినేత జగన్
YS Jagan in Vinukonda : వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా(ఇండియా టుడే)తో మాట్లాడిన జగన్… ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీతో పాటు పలువురిని కలుస్తామన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు.
“ఈ 45 రోజుల టీడీపీ పాలనలో ఏకంగా 36 రాజీకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 506 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు” అని వైఎస్ జగన్ ఆరోపించారు.
"రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు. దిశా యాప్ తో ఫిర్యాదులు స్వీకరించాం. గత ప్రభుత్వం సకాలంలో విద్యా, వసతి దీవెన ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం లేదు. జగనే ఉండి ఉంటే రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ డబ్బులు, మత్స్యకార డబ్బులు వచ్చేవి. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలను విస్మరించే పనిలో ఉన్నాడు. చెప్పిన హామీల గురించి ప్రజలు అడిగే పరిస్థితులు ఉన్నాయి" అని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని జగన్ తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇదే కాకుండా మంగళవారమే వైసీపీ నేతలు ఢిల్లీకి చేరుకొని బుధవారం ధర్నా చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాను కలుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిస్తామని వివరించారు.
ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలనే అంశంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని జగన్ తెలిపారు. రషీద్ హత్య కేసులో పోలీసులు తీరు దారుణంగా ఉందన్నారు. లేని కేసులు ఉన్నాయని పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను సీఎం చంద్రబాబు ఖండించి… ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పోలీసులు సరైన మార్గంలో నడవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వైఎస్ జగన్ భద్రత కుదించారని వైసీపీ ఆరోపించింది. జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మరో ప్రైవేట్ వాహనంలో వినుకొండకు ప్రయాణించారు. భద్రత కుదింపుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
మాజీ సిఎంలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువే జగన్‌కు ఇస్తున్నట్టు ఏపీ సిఎంఓ వర్గాలు చెప్పాయి. వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దారిలో పలుమార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్… మరో వాహనంలో వినుకొండకు చేరుకున్నారు.