Nellore ZP Meeting: జడ్పీ సమావేశంలో వేమిరెడ్డికి అవమానం,ఇంకెప్పుడూ రానని అలిగి వెళ్లిపోయిన ఎంపీ
04 November 2024, 8:16 IST
- Nellore ZP Meeting: నెల్లూరు జడ్పీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవమానం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ ఎంపీ సభ నుంచి నిష్క్రమించడంతో ఎంపీ అనుచరులు మండిపడ్డారు. మంత్రి ఆనం రాంనారాయణ ఎంపీని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు.
ఆర్డీఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
bkNellore ZP Meeting: నెల్లూరు జిల్లా జెడ్పీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవమానం జరగడంతో ఆయన సభ నుంచి నిష్క్రమించారు. ఎంపీని అవమానించారంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. సమావేశంలో పాల్గోన్న మంత్రులు, ప్రజాప్రతినిధుల్ని పరిచయం చేసిన ఆర్డీఓ ఎంపీని విస్మరించడంతో ఆయన నొచ్చుకుని వేదిక దిగి వెళ్లిపోయారు.
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నవంబర్ 3న ఆదివారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూర జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో ఆర్డీవో ప్రత్యూష సమావేశానికి సారథ్యం వహించిన ప్రజా ప్రతినిధుల్ని పరిచయం చేసి బోకేలు అందించారు. ముందు మంత్రుల్ని, ఆ తర్వాత ఎమ్మెల్యేలను పిలిచారు. బోకేలను అందించారు. వేదికపై కూర్చున్న పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు.
కాసేపు మౌనంగా ఉండిపోయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పేరును విస్మరించడంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. మొదట ఏమి జరిగిందో అర్థం కాని మంత్రులు నారాయణ, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. తనకు గౌరవం లేని చోట ఉండలేనంటూ వేమిరెడ్డి గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఎంపీతో పాటు ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి కారు వరకు వెళ్లిన ఆనం బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తాను అవమానం జరిగిన చోటుకు రాలేనని, ఇంకెప్పుడూ సమావేశానికి రానని చెప్పి వెళ్లిపోయారు.
వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్డీఓ వివరణ ఇస్తూ వేమిరెడ్డి పేరుకూడా రాసుకున్నానని, చదవడంలో పొరబాటు జరిగిందని చెప్పారు. రివ్యూ మీటింగ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో వేమిరెడ్డి పేరును విస్మరించారు.
నెల్లూరు జడ్పీ సమావేశంలో ఎంపీకి అవమానం జరగడంతో ట్రోలింగ్ జరిగింది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నవేమిరెడ్డి ఎన్నికలకు ముందు టీడీపలో చేరారు. దీంతో వైసీపీ శ్రేణులు వేమిరెడ్డికి బాగా జరిగిందని ట్రోల్ చేస్తున్నాయి.
టాపిక్