తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్ట్ - 14 రోజుల పాటు రిమాండ్

Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్ట్ - 14 రోజుల పాటు రిమాండ్

Published Feb 14, 2025 05:49 AM IST

google News
    • మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా…. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
వల్లభనేని వంశీ అరెస్ట్

వల్లభనేని వంశీ అరెస్ట్

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట గురువారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ్నుంచి విజయవాడకు తరలించారు. కృష్ణలంక పోలీస్స్టేషన్ కు వల్లభనేని వంశీ తరలించగా.. కొన్నిగంటల పాటు ప్రశ్నించారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.

8 గంటల పాటు విచారణ…..

వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు…. కృష్ణలంక పోలీస్స్టేషన్ లో దాదాపు 8 గంటలకు పైగా విచారించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారని నమోదైన కేసు గురించి ఆరా తీశారు. ఫిర్యాదులో బాధిత కుటుంబం ఇచ్చిన ఆధారాలు చూపించి వంశీ నుంచి వివరణ తీసుకున్నారు.

అర్ధరాత్రి వరకు వాదనలు - 14 రోజులు రిమాండ్

విచారణ తర్వాత వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌ వాదనలు వినిపించగా… వల్లభనేని వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

అర్ధరాత్రి వరకు ఇరువైపు వాదనలు కొనసాగాయి. చివరగా వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లకు 14 రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. కోర్టు ఉత్తర్వులతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.

అసలేం జరిగింది…?

గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి.. బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్ధన్‌ ఫిర్యాదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో.. తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

2023 ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసు ఆవరణలోని ఓ కారుకు నిప్పంటించారు. క్షణాల్లో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు కాలి బూడిదైపోయింది. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగలేదని టీడీపీ పదే పదే చెబుతూ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావటంతో… ఈ కేసు మళ్లీ తెరపైకి రావటంతో లోతుగా విచారణ జరిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా… తాజాగా వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ అయ్యారు.

తదుపరి వ్యాసం