Nagarjunasagar Project Dispute : సాగర్ జలాల వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం - ఏపీ, తెలంగాణ అంగీకారం
Updated Dec 01, 2023 07:12 PM IST
- Nagarjunasagar Project Dispute Update: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సాగర్ జలాల నీటి విడుదల వివాదం తారస్థాయికి చేరింది. ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేసుకున్న పరిస్థితి కనిపిచింది. కేఆర్ఎంబీ కూడా జోక్యం చేసుకోగా.. తాజాగా కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది.
సాగర్ ప్రాజెక్ట్ నీటి వివాదం
Nagarjunasagar Project Dispute Update: నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదానికి తెర పడింది.గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించారు. డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ సూచించిన ప్రతిపాదనలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఫలితంగా డ్యామ్ పై నెలకొన్న వివాదం ముగిసే అవకాశం ఏర్పడింది.
అంతకుముందు ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసంది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.
ఇక నాగార్జున సాగర్ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు బలవంతంగా చొచ్చుకు రావడంపై ఎస్పీఎఫ్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు. సిసి కెమెరాలు ధ్వంసం చేసి, తమ భూభాగంలో బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 447, 427 కిందతెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో… కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంది. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి.