బాపట్ల బీచ్‌లో మరో ఇద్దరు మృతి.. వరుస ఘటనలతో అప్రమత్తం
24 June 2024, 8:38 IST
- బాపట్ల బీచ్‌లో వినోదం కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి చనిపోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
బాపట్ల బీచ్ లో ఇద్దరు మృతి (ప్రతీకాత్మక చిత్రం)
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని భార్గవపేట, దేవునిమాన్యానికి చెందిన స్వర్ణకారు పనిచేసే 12 మంది యువకులు ప్రత్యేక వాహనంలో బాపట్ల జిల్లా వేటపాటెం మండలం రామాపురం బీచ్‌కు వెళ్లారు. స్నేహితులంతా సరదాగా గడపడం కోసమని బీచ్‌కు వెళ్లారు. అంతా సరదాగా కాసేపు గడిపారు.
అంతలోనే మృత్యువు ఇద్దరు యువకులను కాటేసింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఇద్దరు యువకులు బలయ్యారు. తమ స్నేహితులు కళ్లెదుటే కొట్టుకుపోతుంటే, మిగతావారు కేకలు వేయడం తప్ప ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అయితే బీచ్ ప్రాంతంలో గస్తీ చేస్తున్న పోలీసులు రక్షించేందకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని చీరాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
మృతి చెందిన యువకులు మంగళగిరి పట్టణంలోని కుప్పూరావు కాలనీకి చెందినవారు. పడవల బాలసాయి (25), కొసనం బాలనాగేశ్వరరావు (27) సముద్రపు అలల తాకిడికి కొట్టుకుపోయారు. వీరిలో బాలసాయికి వివాహం అయింది. మూడు నెలల పాప జన్వికా ఖుషీ ఉంది. కొసనం బాలనాగేశ్వరరావుకు ఇంకా పెళ్లి కాలేదు.
మృత దేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. సోమవారం పోస్టుమార్టం చేసి మృతదేహాలను అప్పగిస్తారు. ఈపూరుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.శంకర్రావు, ఇతర నేతలు సందర్శించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
మంత్రి నారా లోకేష్ దిగ్బ్రాంతి
మంగళగిరి చెందిన యువకుల మృతి పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఇటీవలే ఇద్దరు యువకులు మృతి చెందడం, తిరిగి మరో దుర్ఘటన నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
- రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు