Guntur Minor Girl: గుంటూరులో ఘోరం, చేబ్రోలులో కూల్ డ్రింక్ ఇచ్చి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
16 July 2024, 8:44 IST
- Guntur Minor Girl: గుంటూరు జిల్లాలో కూల్ డ్రింక్ ఇచ్చి ఎనిమిదో తరగతి బాలికపై అత్యాచారం...ఆపై హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
చేబ్రోలులో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య
Guntur Minor Girl: గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఎనిమిదో తరగతి చిన్నారికి కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ బాలికను హత్య చేశాడు.
అభంశుభం తెలియన చిన్నారులపై మానవ మృగాల దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉయ్యాలలో ఉన్న ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన, అనంతపురంలో ఎనిమిదో తరగతి చదుతున్న బాలికపై అత్యాచారయత్నం ఘటన మరిచిపోకముందే, గుంటూరు జిల్లాలో చేబ్రోలులో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆ బాలికను హత్య చేయడం కలకలం రేపింది.
రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రోజే స్కూల్‌కు వెళ్లిన చిన్నారిపై అమానుషంగా దాడి జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన ఏబాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి, ఆపై బాలికను హత్య చేశాడు.
గ్రామానికి చెందిన 13ఏళ్ల బాలిక సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లేది. సోమవారం స్కూల్‌కి ఇద్దరు కలిసి వెళ్లారు. సాయంత్రం ఆమె సోదరుడు ఒక్కడే ఇంటికి వెళ్లాడు. తల్లి కుమార్తె గురించి అడగడంతో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. బాలిక మధ్యాహ్నమే ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వెళ్లిపోయినట్టు చెప్పడంతో గ్రామంలో వెదకడం ప్రారంభించారు.
సోమవారం బాలికకు గ్రామంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే నాగరాజు అనే వ్యక్తి కూల్‌డ్రింక్ ఇవ్వడాన్ని గమనించిన స్థానికులు ఆ విషయాన్ని సోదరుడికి చెప్పారు.దీంతో నాగరాజు ఇంటికి వెళ్లి బాలిక సోదరుడు, తల్లిదండ్రులు, స్థానికులు చూశారు. అతను ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండటం, ఇంటి బయట చెల్లి చెప్పులు కనిపించడంతో చుట్టుపక్కల వెదికారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికి ఓపెన్ చేసి చూశారు. గదిలో బాలిక చలనం లేకుండా పడిపోయి ఉండటంతో తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఇంటి లోపలకి ప్రవేశించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది.
బాలిక మెడపై గాయాలు ఉండటంతో హత్యకు గురై ఉంటుందని అనుమానించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
బాలిక మెడపైన, శరీరంపైన గోళ్లతో గాట్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలతో పాటు అక్కడ పడిఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా చేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృత దేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం పంపారు. బాలిక మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై తెనాలి డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ నాగరాజుకు వివాహమయిందని, కానీ మూడేళ్ల క్రితమే భార్యను వదిలేశాడని స్థానికులు చెప్పినట్లు తెలిపారు. బాలిక మృతదేహం దొరికిన ఇంట్లో నాగరాజు అద్దెకు ఉంటున్నాడని, నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, పొన్నూరు రూరల్ సీఐ, రూరల్ ఎస్ఐలతో కూడిన బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)