తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Vs Sharmila: అన్నాచెల్లి మధ్యలో ఆస్తులు, షేర్లు.. తారా స్థాయికి చేరిన జగన్‌ కుటుంబ పోరు,అసలు కారణాలు వేరే..

Ys Jagan Vs Sharmila: అన్నాచెల్లి మధ్యలో ఆస్తులు, షేర్లు.. తారా స్థాయికి చేరిన జగన్‌ కుటుంబ పోరు,అసలు కారణాలు వేరే..

24 October 2024, 6:30 IST

google News
    • Ys Jagan Vs Sharmila: వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య తలెత్తిన విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య ఆస్తి పంపకాల్లో భాగంగా షర్మిల దక్కిన వాటాలను ఆమె పేరిట బదిలీ చేసుకోవడంపై రగడ మొదలైంది. కుటుంబ కలహాలు ముదిరాయి.
అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు
అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు

అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు

Ys Jagan Vs Sharmila: వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరిగిన పరిణామాల్లో కుటుంబంలో ఇప్పటికే ఉన్న వివాదాలు మరింత ముదిరాయి. అన్నా చెల్లెళ్ల మధ్య లేఖ యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను చేరింది. జగన్‌కు తెలియకుండా, అమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం ముదిరింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర  దర్యాప్తు సంస్థలు షేర్ల బదిలీపై ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.

ఏమి జరిగిందంటే....

వైఎస్‌ జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీలలో వాటాల బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జులై 26న మరో గిఫ్ట్‌ డీడ్ రాసుకున్నారు. ఈ మేరకు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లలో తమ వాటాలను వైఎస్‌ విజయమ్మ పేరిట, జగన్ సతీమణి భారతీ రెడ్డి బదిలీ చేశారు. 

2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్‌పై నమోదైన మనీ లాండరింగ్‌ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు.

షర్మిల వాదన ఇది....

2021 మార్చిలో జగన్‌ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన షేర్లను షర్మిల తన పేరిట బదిలీ చేసుకున్నారు. షేర్ల బదిలీకి సంబంధించి గిఫ్ట్ డీడ్‌ ఆధారంగా షర్మిల తరపు ఆడిటర్‌ వాటిని ఆమె పేరిట బదలాయిస్తూ బోర్డు తీర్మానాన్ని ఆర్వోసీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో సదరు ఆస్తులు ఈడీ జప్తులో ఉండటంతో కంపెనీ వ్యవహారాల శాఖ ఈడీకి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 

మనీలాండరింగ్‌ కేసులో అటాచ్‌మెంట్‌లో  ఉన్న ఆస్తుల బదలాయింపుపై ఈడీ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైనట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సరస్వతీ ఇండస్ట్రీస్‌‌కు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తమ వద్దే ఉన్నాయని జగన్‌ షర్మిలకు రాసిన లేఖలో గుర్తు చేశారు. గిఫ్ట్‌డీడ్ ఆధారంగా షేర్ల బదిలీ జరగడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

నోటీసులతో అలర్ట్‌...

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్‌ ఎక్కువగా బెంగుళూరులోనే ఉండే వారు. ఈ క్రమంలో ఈడీ నుంచి షేర్ల బదిలీ నోటీసులు అందడంతో ఆయన ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. తనను ఇబ్బందులకు గురి చేయడానికే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి షర్మిల కంపెనీ షేర్లను బదిలీ చేసుకున్నట్టు భావించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల్ని బదిల చేస్తే బెయిల్ రద్దు చేయొచ్చనే దురుద్దేశం ఉందని అనుమానించారు. దీంతో ఈ వ్యవహారంపై షర్మిలకు నేరుగా లేఖ రాశారు. తనను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నావంటూ అందులో ఆరోపించారు.

ఆగస్టు 27న షర్మిలకు రాసిన లేఖలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేసేలా విమర‌్శలు చేస్తున్న అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఆస్తుల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పలు సందర్భాల్లో దాదాపు రూ.200కోట్ల రుపాయల నగదును దశాబ్ద కాలంలో ఆమెకు చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు. చెల్లెలిపై ప్రేమ, అప్యాయతతో ఆస్తుల పంపకానికి అంగీకరించినట్టు అందులో పేర్కొన్నారు.

సోదరికి ఇవ్వాల్సిన ఆస్తుల పంపకంపై 2019లో ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో అంగీకరించినట్టు గుర్తు చేశారు. అయితే మారిన పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఓయూకు కట్టుబడి ఉండలేనని పేర్కొన్నారు. దాంతో పాటు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై 2021లో చేసిన గిఫ్ట్‌ డీడ్‌ కూడా రద్దు అవుతున్నట్టేనని ఆ లేఖలో పేర్కొన్నారు.

జగన్ లేఖపై షర్మిల కూడా ....

2019 నాటి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు జగన్‌ రాసిన లేఖపై షర్మిల కూడా స్పందించారు. తండ్రి బతికున్న సమయంలో ఆయన మనుమలు, మనవరాళ్లు నలుగురికి ఆస్తుల్లో సమాన వాటాలు దక్కాలని నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. తనపై ఉన్న ప్రేమ అప్యాయతతో ఆస్తుల పంపకానికి ఒప్పుకుంటున్నట్టు ఎంఓయూలో పేర్కొనడం అర్థ సత్యమేనని షర్మిల ఆరోపించారు. భారతీ సిమెంట్స్‌, సాక్షి వంటి సంస్థల్లో మెజార్టీ షేర్లు జగన్ చేతిలో ఉన్నాయని, అతని ఆధిపత్యమే కొనసాగుతోందని గుర్తు చేశారు.

బలం ఉందనే ఉద్దేశంతో బలవంతంగా ఎంఓయూని నిర్ణయించినట్టు ఆరోపించారు. షేర్లను తల్లిపేరిట బదిలీ చేసిన తర్వాత, గిఫ్ట్ డీడ్‌పై జగన్, బారతీలు సంతకాలు చేసిన తర్వాత వాటిపై వివాదాలు సృష్టించడం సరికాదని ఆరోపించారు. తన రాజకీయ జీవితం తన వ్యక్తిగత నిర్ణయమని షర్మిల ఆ లేఖలో స్పష్టం చేశారు. యలహంకలో ఉన్న 20ఎకరాల ఇంటిపై జగన్ మౌఖికంగా అమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. షర్మిల రాసిన లేఖపై ఆమె తల్లి విజయమ్మ కూడా సంతకం చేశారు.

వివాదానికి అసలు కారణం వేరే…

జగన్‌, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండటమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం, ఆస్తులు, డబ్బు, ఆధిపత్యం వ్యవహారంలో జగన్‌ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

జగన్‌ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో తలెత్తిన స్పర్థలు కూడా ఈ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. సోదరితో తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉన్నా రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రత్యర్థుల సాయంతో వివాదాన్ని సృష్టిస్తున్నారనే అపోహల్నికొందరు జగన్‌కు కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

తదుపరి వ్యాసం