Attack On TDP Office Case : అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారు.. దాడి జరిగిన రోజు మంగళగిరిలో లేను : సజ్జల
17 October 2024, 18:11 IST
- Attack On TDP Office Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. వైసీపీ ముఖ్యనేత, గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సజ్జల.. నోటీసులు, పోలీసుల ప్రశ్నలపై స్పందించారు. విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
'ప్రజా సమస్యలను టీడీపీ గాలికి వదిలేసింది. కేవలం వైసీపీ నాయకులను మాత్రమే టార్గెట్ చేశారు. మా నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారు. విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారు. ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారు. దాడి జరిగిన రోజు నేను మంగళగిరిలోనే లేను. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ కక్షసాధింపులు మానుకోవాలి. కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారు. ఎల్‌వోసీ ఇవ్వడంపై కోర్టుకు వెళ్తాం' అని సజ్జల స్పష్టం చేశారు.
2021 అక్టోబర్ 19న కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ ఆఫీసులో వీరంగం సృష్టించారు. ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు విచారించారు. తాజాగా.. సజ్జల రామకృష్ణా రెడ్డిని విచారణకు పిలిచారు.
టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తు ముగుస్తుండడంతో దాడిలో ప్రమేయం ఉన్న ముఖ్య నేతలను విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య.. సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన పానుగంటి చైతన్య.. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ దాడికి పానుగంటి చైతన్య కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.