Tirupati Crime : విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Published Feb 06, 2025 12:18 PM IST
- Tirupati Crime : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గ్రామస్తులతో కలిసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
తిరుపతి జిల్లాలో నారాయణవనం మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చాటూరు మండలం కీలపూడికి చెందిన టి.వెంకటరమణ.. నారాయణవనం మండలంలోని ఒక గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సమీప గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయశాంతి వృత్తిపరమైన శిక్షణ తరగతులకు వెళ్లారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఆదేశాల మేరకు ఈ పాఠశాలకు వెంకటరమణ డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించడానికి వెళ్లారు.
అసభ్య ప్రవర్తన..
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో.. నలుగురు విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు వెంకటరమణ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లిన చిన్నారులు.. ఉపాధ్యాయుడు తమ పట్ల ప్రవర్తించిన తీరును తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో బుధవారం చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు వెంకటరమణను నిదీశారు. వారి ప్రశ్నలకు ఉపాధ్యాయుడు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. వారిని నుంచి తప్పించుకుని ఆయన పారిపోయాడు.
పోలీసులకు ఫిర్యాదు..
బాలికల తల్లిదండ్రులు, గ్రామస్తులు నారాయణవనం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుందని నారాయణవనం ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలకు సంబంధించిన నివేదికను డీఈవోకు.. డిప్యూటీ డీఈవో ప్రభాకర్ రాజు పంపారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో కూడా బాలికలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్ కూడా చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురిచేడు మండలం కాటంవారిపాలేనికి చెందిన ఉపాధ్యాయుడు గోపనబోయిన రవికుమార్.. మద్దిపాడు మండలంలోని ఒక గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 2017 నుంచి పని చేస్తున్నాడు.
లైంగిక వేధింపులు..
బాలికలపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్త ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు.. జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్త రుజువు అయ్యాయి. డీఈవో కిరణ్ కుమార్ ఆ ఉపాధ్యాయుడు రవి కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆధారాలను మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో సమర్పించారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్ఐ బి.శివరామయ్య స్పందిస్తూ.. పోక్సో కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)