Anakapalle : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన బంధువులు.. పోక్సో కేసు నమోదు
Published Feb 08, 2025 09:27 AM IST
- Anakapalle : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది విద్యార్థిని. కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్‌కెళ్లి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు.
విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసుకోవాడనికి బుధవారం మధ్యాహ్నం లెక్కల మాస్టార్ దారపు గంగాప్రసాద్ వద్దకు వెళ్లింది. అప్పుడు పంపించేసి.. కొద్దిసేపటి తరువాత రమ్మని చెప్పాడు. సాయంత్రం ఆ విద్యార్థిని లెక్కల మాస్టార్ గంగాప్రసాద్ వద్దకు వెళ్లింది.
తలుపులు వేసి..
విద్యార్థి వెళ్లిన వెంటనే క్లాస్ రూమ్ తలుపులు వేసేసి, చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వారించినా ఆయన వదలలేదు. ఎలాగోలా బాలిక ఆ కీచక ఉపాధ్యాయుడి నుంచి తప్పించుకుంది. రూమ్ నుంచి ఏడుస్తూ బయటకొచ్చిన బాలిక.. స్కూల్ ఆయాకు విషయం చెప్పింది. దీంతో స్కూల్ ఆయా విద్యార్థిని తల్లిదండ్రులకు బాలిక ఏడుస్తుందని సమాచారం అందించింది. తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు.
స్తంభానికి కట్టేసి..
ఇంటికి వెళ్లిన తరువాత విద్యార్థిని జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్‌కు వెళ్లారు. ఉపాధ్యాయుడు గంగాప్రసాద్ అక్కడ లేడు. సమీపంలో ఉన్న వేరొక స్కూల్‌లో ఉన్నాడని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి ఉపాధ్యాయుడుని కొట్టుకుంటూ ఘటన జరిగిన స్కూల్‌కు తీసుకొచ్చారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంగాప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వీడియో వైరల్..
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారడంతో.. అధికార యంత్రాంగం స్పందించింది. హోమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు.. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావులు.. ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు గురువారం సాయంత్రం స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్ రామరాజు నుంచి వివరాలు సేకరించారు.
పోక్సో కేసు నమోదు..
శుక్రవారం ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆయన్ను విధుల నుంచి తొలగించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని.. విద్యార్థిని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)