తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sachivalayalu: సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన జరిగేనా, పౌరసేవలు తక్కువ, పనిఒత్తిడి ఎక్కువ

AP Sachivalayalu: సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన జరిగేనా, పౌరసేవలు తక్కువ, పనిఒత్తిడి ఎక్కువ

29 November 2024, 10:30 IST

google News
    • AP Sachivalayalu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు సమీపిస్తున్నా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల పనితీరును క్రమబద్దీకరించలేకపోయింది.  గత ప్రభుత్వం పథకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ, ఇతర శాఖల పనులు చేయడమే విధిగా మారింది. 
ఏపీ గ్రామ, వార్డు సచివాలయం
ఏపీ గ్రామ, వార్డు సచివాలయం

ఏపీ గ్రామ, వార్డు సచివాలయం

AP Sachivalayalu: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు మాత్రం కొరవడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయాల్లో దాదాపు లక్షా 30వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 23 రకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను అందించడంలో సచివాలయాలు కీలకం వ్యవహరించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాత పథకాలు నిలిచిపోయాయి. దీంతో సచివాలయ సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖలు తమ పనులకు వాడుకుంటున్నారు. అవి లేని చోట ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు.

ఎక్కడి వాళ్లకు అక్కడే సేవలు..

రాష్ట్ర వ్యాప్తంగా పౌర సేవల్ని ప్రజల వద్దకు చేర్చే క్రమంలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రతి 2-3వేల జనాభాకు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో 8-10మంది సిబ్బందిని నియమించారు. ఇలా ఏర్పాటు చేసిన సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటిని అయా సచివాలయాలకు అనుసంధానించారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే వారు.

ఊరురా సచివాలయాలను ఏర్పాటు చేసినా ఆ సచివాలయం పరిధిలో ప్రజలు తప్ప ఇతరులకు అవి పనికొచ్చేవి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించినా ఒక సచివాలయానికి సంబంధించిన వారికి మరో సచివాలయం పరిధిలో సేవలు అందని పరిస్థితి ఉండేది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ విభాగం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించిన చరిత్ర ఏపీకి ఉంది. సచివాలయాల ఏర్పాటుతో గతంలో ఏర్పాటైన మీసేవలను రద్దు చేయాలని ప్రభుత్వం భావించింది.హైకోర్టు జోక్యంతో వాటిని కొనసాగిస్తున్నారు. మరోవైపు సచివాలయాల్లో అందాల్సిన పౌర సేవలు సక్రమంగా అందకపోవడం, ప్రచారం తప్ప డిజిటల్ సేవలు ప్రజలకు అందించే పరిస్థితులు లేకపోవడంతో ప్రజలు తిరిగి మీసేవల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

గతంలోనే మెరుగైన సేవలు…

సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిపై అన్ని ప్రభుత్వ శాఖలు పెత్తనం చేయడం మరో కోణం. నేరుగా పౌర సేవలు అందించే అధికారం సచివాలయాలకు కల్పించలేదు. సంబంధిత విభాగం ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా దరఖాస్తులను పంపడానికి మాత్రమే పరిమితం అయ్యాయి.

ఉదాహరణకు పదేళ్ల క్రితం వరకు విజయవాడ అర్బన్ మొత్తం ఒకే మండలంగా ఉండేది. ఒక ఎమ్మార్వోతో పాటు మరో 60మంది సిబ్బంది ఉండేవారు. అప్పట్లో మీ సేవల్లో పౌర సేవల కోసం దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా మూడు రోజుల్లో వాటికి పరిష్కారం లభించేంది. క్యాస్ట్‌, ఇన్‌కమ్‌, రెసిడెన్స్‌ తో పాటు రెవిన్యూ కార్యాలయాలు జారీ చేసే అన్ని రకాల సర్టిఫికెట్లను గరిష్టంగా వారం లోపు పరిష్కరించేవారు. ఉమ్మడి ఏపీలో డిజిటల్ పౌర సేవల్ని చంద్రబాబు ప్రవేశపెట్టినపుడు ఏ సర్టిఫికెట్ ఎన్ని రోజుల్లో జారీ చేయాలనే సిటిజన్ ఛార్టర్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించేవారు. గడువులోగా సేవలు అందకపోతే ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉండేవి.

ప్రస్తుతం విజయవాడ నగరం నాలుగు మండలాలుగా మారింది. నగరంలో నలుగురు ఎమ్మార్వోలు పనిచేస్తున్నారు. 286 సచివాలయాల్లో 286మంది విఆర్వో స‌్థాయి సిబ్బంది పనిచేస్తున్నా పౌరసేవలు సక్రమంగా అందడం లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేస్తే ఎప్పటి సర్టిఫికెట్లు అందుతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు సహజంగా అలవడే అవలక్షణాలను కొందరు సచివాలయ సిబ్బంది వేగంగా అలవర్చుకున్నారు. కార్యాలయాల్లో ఉండకపోవడం సేవల్ని సక్రమంగా అందించకపోవడం వంటి సమస్యలు రాష్ట్రమంతటా ఉన్నాయి. దీనికి తోడు ఇతర శాఖలు అప్పగించిన పని ఒత్తిడి తమపై ఉంటోందనే ఉద్యోగుల వాదన ఉంది.

ఆన్‌లైన్‌లో అందవు, సచివాలయాల్లో చేయరు..

డిజిటల్ పౌర సేవల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రెవిన్యూ ద్వారా అందించే పలు రకాల సేవల్ని నేరుగా అందిస్తున్నట్టు అయా శాఖలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయాల్లో మ్యూటేషన్‌ వంటి సేవలు అందించాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. ఈసీలు, సర్టిఫైడ్ కాపీల వంటి వాటిని ఆన్‌లైన్‌లో జారీ చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆన్‌లైన్‌లో జారీ చేసే సర్టిఫికెట్లను న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. స్వయంగా దరఖాస్తు చేసి ప్రింట్ తీసుకుంటే తెల్లకాగితంపై వచ్చే సర్టిఫికెట్లను ఈసీలు, సీసీలను కోర్టులు అనుమతించడం లేదని న్యాయవాదులు చెబుతున్నారు.

పనిభారంతో పాటు నిర్లక్ష్యం కూడా…

సచివాలయ ఉద్యోగులకు విధి నిర్వహణలో స్వతంత్ర గుర్తింపు లేకపోవడంతో వారిలో జవాబుదారీతనం కూడా లోపించింది. దీనికి తోడు వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్ర స్థాయి పనులకు సచివాలయ ఉద్యోగులను వాడుకుంటున్నాయి. ఎవరికి వారు తాము అప్పగించిన పని మొదట పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే, జియో ట్యాగింగ్‌ పూర్తి చేసే బాధ్యత అప్పగించింది. అది ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని చోట్ల బయో మెట్రిక్, ఐరీస్‌ యంత్రాలు పనిచేయక పోవడం, మరికొన్ని చోట ఇతర పని ఒత్తిళ్లతో జియో ట్యాగింగ్‌, ఇంటింటి సర్వేను అటకెక్కించారు.

సచివాలయాల నిర్వహణపై ఏటా వేల కోట్ల రుపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఊరురా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఆలోచన బాగున్నా వాటి ద్వారా అందుతున్న సేవలు ఏ మేరకు ప్రజలకు చేరుతున్నాయనేది కూడా ముఖ్యమే. ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన పౌర సేవల్ని సచివాలయాలు నేరుగా అందించే పరిస్థితి లేదు. పట్టణాల్లో కనీసం డ్రైనేజీ కనెక్షన్లు, పారిశుధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూళ్లు, విద్యుత్ కనెక్షన్లు వంటి సేవల్ని కూడా సచివాలయాలు నేరుగా అందించే పరిస్థితి లేదు. 'ఏపీలో సచివాలయ వ్యవస్థ వైఫల్యాలపై జాతీయ స్థాయి పబ్లిక్ పాలసీ కోర్సుల్లో పాఠ్యాంశాలుగా చెప్పే పరిస్థితి నెలకొంది.

తదుపరి వ్యాసం