Ap Accidents: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, గేదెలను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
22 July 2024, 11:24 IST
- Ap Accidents: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలు తయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు
Ap Accidents: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలు తయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విజయవాడకు చెందిన శ్రీవెంకట కనకదుర్గ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 32 మందితో ప్రయాణికులతో శనివారం రాత్రి అనంతపురానికి బయలుదేరింది.
అయితే ఆదివారం తెల్లవారు జామున ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం, తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపైన బస్సు అదుపుతప్పి గేదెలను ఢీకొట్టింది. వెంటనే బస్సు పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును తీశారు. అయితే బస్సు నుజ్జునుజ్జు అయింది. బస్సులోని ప్రయాణికులను అతికష్టం మీద బయటకు తీశారు.
ఈ రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా ధర్మవరం టౌన్‌కు చెందిన గజ్జల శివయ్య (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కొర్ర విజయలక్ష్మి బాయ్ (50) తీవ్రంగా గాయపడగా, మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన గజ్జల శివయ్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
విజయనగరం జిల్లాలో …
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తురక ప్రవీణ చంద్ (34) భార్య సుస్మితతో కలిసి పార్వతీపురంలోని అత్తవారింటికి వచ్చారు. అయితే ఆదివారం స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. జొన్నాడ వద్దకు వచ్చే సరికి టాయిలెట్ వస్తుందని, కారు ఆపారు. టాయిలెట్ పూర్తి చేసుకున్న తరువాత తిరిగి కారు ఎక్కే క్రమంలో విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి ప్రవీణ్ చంద్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ బోల్తా కొట్టింది.
దీంతో ప్రవీణ్ చంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ బోల్తా కొట్టడంతో వ్యాన్‌లోపల ఉన్న పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామానికి చెందిన బాడితమాను సన్యాసి (60) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే క్రమంలో రోడ్డుపై సైకిల్‌పై వెళ్‌తున్న చందక లక్ష్మణరావును సైతం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఆయనను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)