Lokesh Redbook: త్వరలో రెడ్‌బుక్ ఛాప్టర్ 3, ఎవరిని వదిలేది లేదన్న లోకేష్.. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
01 November 2024, 7:39 IST
- Lokesh Redbook: రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ అమెరికాలో ప్రకటించారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
త్వరలో రెడ్ బుక్ ఛాప్టర్ 3 విడుదల చేస్తానని ప్రకటించిన లోకేష్
Lokesh Redbook: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ...వారికి అండగా నిలచే బాధ్యత తనదన్నారు. అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైనందని ఎన్ఆర్ఐలు కూడా సైకో బాధితులేనని గుర్తు చేశారు.
ప్రపంచమంతా ఆంధ్రా వైపు చూస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడని, ఐటీ మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు చర్చించి టిసిఎస్ తేగలిగానంటే దానికి కారణం సిబిఎన్ అన్నారు. ఒక్క మెయిల్ తో సత్యనాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. జోహార్ అన్న ఎన్ టి ఆర్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... వారంరోజుల అమెరికా పర్యటనలో నేను ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా సిబిఎన్ పేరు చెప్పగానే రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్పారన్నారు..
వారికి సినిమా చూపించే బాధ్యత నాది
రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని మూడో చాప్టర్ గురించి ఎమ్మెల్యేలు రాము, వెంకట్రావుని అడగాలని లోకేష్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2నిమిషాల పని అని చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? అన్నారు.
ప్రజలు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలు చేస్తామన్నారు. నేను తగ్గేదే లేదని, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్‌దన్నారు. మేం కూడా మనుషులమేనని విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని అంతమాత్రాన అలిగి పడుకోవద్దని మా దృష్టికి తెస్తే సరి చేసుకుంటామన్నారు.
ఎన్నారైలు వేధింపులకు గురయ్యారు…
కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని వైసీపీ వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని, అడుగడుగునా అవమానించారని అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారని లోకేష్ గుర్తు చేశారు. . నేనుకూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నే. నేను యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు.
ఆ జిఓను మడతపెట్టి జేబులో పెట్టుకోమని చెప్పానని పాదయాత్రలో మాట్లాడుతుంటే నా స్టూల్, మైక్ లాగేశారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో అండగా నిలచింది టీడీపీ కార్యకర్తలని గుర్తు చేశారు. ఆరోజే రెడ్ బుక్ గురించి చెప్పానన్నారు. జగన్ గుడ్ బుక్ తెరుస్తాడంట, నోట్ బుక్ చదవడమే రాదు, గుడ్ బుక్ లో ఏం రాస్తారని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్ల అరాచక పాలనలో పెట్టుబడులు పొరుగురాష్ట్రాలకు వెల్లిపోయాయని ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే బాధ్యత కూడా తనపైఉందన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకే సొంతమని గత ప్రభుత్వంలో చేయని తప్పుకు చంద్రబాబును జైలులో బంధించారని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారంతా... ఎన్ఆర్ఐలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారని ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చిందని లోకేష్ చెప్పారు.
ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని బ్రాహ్మణి ప్రశ్నించింది. హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ సభ కు 45వేలమంది హాజరు కావడం చూశాక, బ్రాహ్మణి మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ప్రజలు ఇచ్చిన మద్ధతుతో సైకోతో పోరాడేందుకు మాకు కొండంత బలాన్నిచ్చిందన్నారు.