తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Veligonda Project : వెలిగొండ కల సాకారం, నేటితో రెండో టన్నెల్ పనులు పూర్తి

Veligonda Project : వెలిగొండ కల సాకారం, నేటితో రెండో టన్నెల్ పనులు పూర్తి

23 January 2024, 21:55 IST

google News
    • Veligonda Project : వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన రెండో టన్నెల్ పనులు నేటితో పూర్తి అయినట్లు అధికారులు ప్రకటించారు. నేటితో వెలిగొండ కలసాకాం అయ్యిందన్నారు.
వెలిగొండ రెండో టన్నెల్
వెలిగొండ రెండో టన్నెల్

వెలిగొండ రెండో టన్నెల్

Veligonda Project : ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న పూర్తి కాగా, రెండో సొరంగం పనులు ఇవాళ పూర్తి అయ్యాయి. నేటితో వెలిగొండ కల సాకారం అయ్యిందని అధికారులు తెలిపారు. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ పూర్తి అయ్యాయని ప్రకటించారు. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కి.మీల తవ్వకం పనులు పూర్తి కాగా మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసినట్లు తెలిపారు. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

4.47 లక్షల ఎకరాలకు సాగునీరు

శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ను ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ వైఎస్‌ఆర్ హయాంలోనే పూర్తి అయ్యిందన్నారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమలసాగర్‌కు తరలించవచ్చన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయ్యిందని అధికారులు తెలిపారు. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.

ప్రకాశం జిల్లా కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండో టన్నెల్ పనులను చేపట్టారు. మొదటి సొరంగం ఏడు డయా మీటర్ల వ్యాసార్థంతో తవ్వతే, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్థంతో తవ్వారు. తొలి టన్నెల్ నుంచి 3 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కుల చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు వీటిని నిర్మించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో భాగమైన నల్లమలసాగర్‌కు తరలించిందుకు టన్నెల్ పనులను ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4,47,300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో వైఎస్ఆర్ హయాంలో 2004 అక్టోబర్‌ 27న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

తదుపరి వ్యాసం