TDP Mla Damacharla On Balineni : బాలినేనిని పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరు, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల సంచలన వ్యాఖ్యలు
22 September 2024, 18:50 IST
- TDP Mla Damacharla On Balineni : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. బాలినేని ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి తప్పించుకోలేరన్నారు. బాలినేనిని పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరన్నారు. బాలినేని గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు తీస్తామన్నారు.
బాలినేనిని పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరు, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల సంచలన వ్యాఖ్యలు
TDP Mla Damacharla On Balineni : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బాలినేని జనసేనలో చేరికపై ఒంగోలు టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు బాలినేనిపై పోరాటం చేశామన్నారు. ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని దామచర్ల ఆరోపించారు. తనపై 32 కేసులు పెట్టారన్నారు.
"మా నాయకుడు చంద్రబాబుని బాలినేని దూషించారు. అధికారంపోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. బాలినేని చేసిన అక్రమాల నుంచి పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం"- ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
జనసేనలోకి బాలినేని
త్వరలోనే మంచిరోజు చూసి జనసేన పార్టీలో చేరుతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో బాలినేని గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... జనసేనలోకి పవన్ ఆహ్వానించారని చెప్పారు. త్వరలోనే మంచిరోజు చూసి జనసేన పార్టీ లో చేరుతానని… ఒంగోలు వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. చేరిక కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారని బాలినేని చెప్పారు. ఇదే వేదికగా చాలా మంది కార్పొరేటర్ లు జనసేనలో జాయిన్ అవుతారన్నారు. పవర్ కోసం కాదని…పవన్ కోసమే పార్టీలో చేరుతున్నట్లు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా జనసేనలోకి వెళ్తున్నానని చెప్పారు.
తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని… అలాంటి కుటుంబానికి కష్టకాలంలో అండగా ఉన్నానని బాలినేని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ కోసం పని చేశారని అన్నారు. వీరిలో ఎంత మంది జగన్ మంత్రివర్గంలో ఉన్నారని బాలినేని ప్రశ్నించారు. పవర్ కోసం పాకులాడే వ్యక్తి బాలినేని కాదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
'పవన్ ఆహ్వానించారు.. జనసేనలో చేరుతాను. జగన్ ను ఎలాంటి డబ్బులు అడగలేదు. పార్టీ కోసం నా ఆస్తులను పొగొట్టుకున్నాను. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. అటువైపు నుంచి ఏదైనా రాంగ్ గా మాట్లాడితే నేను కూడా బదులిస్తా. అన్ని విషయాలు బయటపెడతాను. జనసేన కోసం పనిచేస్తాను. పవన్ ను ఎలాంటి పదవులు అడగలేదు" అని బాలినేని వ్యాఖ్యానించారు.