తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Legislative Council : శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఉగ్రరూపం

AP Legislative Council : శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఉగ్రరూపం

14 November 2024, 15:44 IST

google News
    • AP Legislative Council : మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఫైర్ అయ్యారు. జగన్ కుటుంబం గురించి తాము ఏనాడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు సభకు రాలేదంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
మంత్రి లోకేష్
మంత్రి లోకేష్

మంత్రి లోకేష్

గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని.. మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తన తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారని గుర్తు చేశారు. శాసన మండలిలో వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హౌస్‌కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. గౌరవ సభ అయిన తర్వాత వస్తా అన్నారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించి రోజు మీకు గుర్తులేవా ఇవన్నీ. అవమానించలేదని మీరు ఏవిధంగా మాట్లాడతారు' అని నారా లోకేష్ ప్రశ్నించారు.

'షర్మిలను అవమానిస్తారు, విజయలక్ష్మిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు. నేను కూడా మాట్లాడవచ్చు. కానీ ఏనాడూ మేం మాట్లాడలేదు. జగన్ కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు ఏనాడూ మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ హౌస్ కు వచ్చి.. నిలబడ్డారు. సింగిల్‌గా సింహంలా నిలబడ్డారు' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

'నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక చంద్రబాబు సభను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. జగన్ కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాలేదు. తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు' అని లోకేష్ సీరియస్ అయ్యారు.

'ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని బొత్స అన్నారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా. అది సమర్థించడం కాదా? వైసీపీ మండలిపక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 'మాకు ప్రతిపక్ష హోదాలేకుండా చేస్తామన్నారు. ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదు..ప్రజలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో హోదాలను ఎవరూ శాసించలేరు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. రఘురామను అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు.. ఇప్పుడు సభకు రాలేని పరిస్థితి వచ్చింది' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

'ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. అసెంబ్లీని కౌరవసభగా మార్చారు..గౌరవసభ అయ్యాకే వస్తానని శపథం చేశా. జగన్ అవమానించిన వ్యక్తి స్పీకర్ అయ్యారు. జగన్‌ ఎవరినైతే చంపాలనుకున్నారో.. ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్ అయ్యారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం