Lokesh vs Jagan : నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా.. జగన్ రెడ్డి గారు? : లోకేష్
Published Feb 18, 2025 06:05 PM IST
- Lokesh vs Jagan : ఎన్టీఆర్ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా అని ప్రశ్నించారు.
లోకేష్
వల్లభనేని వంశీ అరెస్టుపై మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వంశీని జగన్ జైలులో పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయాయని ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టు అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.
లోకేష్ రియాక్షన్..
'నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది' అని లోకేష్ ట్వీట్ చేశారు.
జగన్ ఏమన్నారు..
'తొలుత కేసులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రీఓపెన్ చేశారు. కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరు చేర్చారు. కేసు బలంగా ఉండాలని చంద్రబాబు, లోకేష్ కుట్ర చేశారు. అందుకే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీస్ తగలబెట్టారంటూ అసత్య ఆరోపణ చేశారు. ఇంకా ఆ భవన యజమానితో ఫిర్యాదు చేయించారు. జడ్జి ఎదుట సత్యవర్థన్ నిజాలు చెప్పారు. ఆ వెంటనే కేసు నమోదు చేశారు. సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేశారంటూ డ్రామా చేశారు' అని జగన్ ఆరోపించారు.
వంశీ, నానిని టార్గెట్ చేశారు..
'వల్లభనేని వంశీపై కేసు నమోదు.. అరెస్ట్.. అడుగడుగునా కుట్ర. కక్షపూరిత వ్యవహారం. తమ సామాజికవర్గంలో ఎవరూ ఎదగకూడదు.. అందుకే వల్లభనేని వంశీ, కొడాలి నానిపై పగబట్టారు. ఆ ఇద్దరూ చంద్రబాబు కంటే, ఆయన కుమారుడి కంటే స్మార్ట్. వారు ఎప్పటికీ రాజకీయంగా ఎదగొద్దన్నది చంద్రబాబు భావన. అందుకే వారిపై అదే పనిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు' అని జగన్ ఆరోపించారు.
పోలీసులకు వార్నింగ్..
'పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోండి. తప్పు చేసిన ఎవరినీ విడిచి పెట్టేది లేదు. రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండబోదు. సప్త సముద్రాల ఆవల ఉన్నా, వెతికి తీసుకొస్తాం. చట్టం ముందు తప్పనిసరిగా నిలబెడతాం' అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
వంశీ భార్య ఆవేదన..
ట్రోలర్స్‌కు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ వార్నింగ్ ఇచ్చారు. 'సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి వేధిస్తున్న వారిపై ప్రైవేటు కేసు వేస్తాను. మహిళలను ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. వంశీ అరెస్టు తర్వాత నా మీద ట్రోల్స్ చేస్తున్నారు. మరి నేను మహిళను కాదా?' అని పంకజశ్రీ ప్రశ్నించారు.