Lokesh In USA: ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన నారా లోకేష్.. పెప్సీకో సీఈఓతో భేటీ
30 October 2024, 12:43 IST
- Lokesh In USA: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. పెప్సీ కో సీఈఓ ఇంద్రనూయితో పాటు రేచీవర్, సేల్స్ ఫోర్స్ సీఈఓలతో భేటీ అయ్యారు.
పెప్సీ కో మాజీ సీఈఓ ఇంద్రనూయితో ఏపీ మంత్రి నారా లోకేష్
Lokesh In USA: అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల లక్ష్యంగా చేస్తున్న పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఎపిలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో మా సంస్థ కీలక పాత్ర వహిస్తోంది. ఎఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నాట్టు తెలిపారు.
ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా అమెజన్ సంస్థ పాత్ర కీలకమైందని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బిఎన్‌బి, 3ఎమ్ వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉందని చెప్పారు.
AWS ప్రపంచవ్యాప్తంగా 32% మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉందని 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వార్షిక ఆదాయం సుమారు $90.8 బిలియన్లుగా ఉండగా, 2024కి $100 బిలియన్లకు చేరుకుందని రేచల్ స్కాఫ్ చెప్పారు.
స్మార్ట్ గవర్నెన్స్ కు క్లౌడ్ సేవలు అందించండి
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎపి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు.
ఎఐ & మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఎపిని ఎఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న మా ఆశయానికి ఊతమిస్తాయి. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి AWS కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉందని చెప్పారు.
స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని. AWS తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు AWS సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, –ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు AWS సహకారాన్ని కోరుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై రేచల్ స్పందిస్తూ ఏపీలో లో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ భేటీ
ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలని అన్నారు.
టెక్ స్టార్టఫ్ లకు ఎఐ టూల్స్, మెంటార్ షిప్ అందించండి
మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ డ్రైవెన్ ఎకానమీపై మేం దృష్టిసారించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించండి. మా రాష్ట్రంలో ఎఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కోరారు.
సేల్స్‌ఫోర్స్ AI సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కండి. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు AI టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాలని కోరారు.
ఐన్ స్టీన్ ఎఐని మా రాష్ట్రంలో పరిచయం చేయండి
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ (CRM)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ యొక్క ఐన్‌స్టీన్ ఎఐని ఏపీలో పరిచయం చేయాలని కోరారు. ఎఐ - పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు సహకారం అందించాలని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్‌ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. పరిపాలనలో ఎఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఎపిలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేష్ కోరారు.
బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి
పెప్సికో మాజీ చైర్మన్ & సిఇఓ ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబుగారి నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాలన్నారు.
స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటిచెప్పాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు వివరించార.