తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh In Delhi: ఢిల్లీలో నారా లోకేష్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, జోరుగా ఊహాగానాలు

Lokesh In Delhi: ఢిల్లీలో నారా లోకేష్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, జోరుగా ఊహాగానాలు

Published Feb 06, 2025 07:08 AM IST

google News
    • Lokesh In Delhi:  మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  మంత్రుల ఢిల్లీ పర్యటనలు సాధారణమే అయినా ఢిల్లీలో కీలకమైన నేతలతో  నారా లోకేష్ భేటీ అవుతున్నారు. వారసత్వాలపై నమ్మకం లేదని అవకాశాలను అందిపుచ్చు కోవాల్సిందేనని  చంద్రబాబు  వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ దూకుడు పెంచినట్టు  ప్రచారమవుతోంది.
ఢిల్లీలో మాజీ ప్రధాని దేవగౌడకు నమస్కరిస్తున్న మంత్ర నారా లోకేష్‌

ఢిల్లీలో మాజీ ప్రధాని దేవగౌడకు నమస్కరిస్తున్న మంత్ర నారా లోకేష్‌

Lokesh In Delhi: మంత్రి నారా లోకేష్‌, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు.. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏకైక తనయుడు. యువగళం పాదయాత్రతో టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన నాయకుడు.. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో మంత్రి పదవిలో ఉన్నారు. 

ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్‌ కీలకమైన స్థానంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత  కీలకమైన స్థాయిలో లోకేష్ ఉన్నారు. గత రెండు రోజులుగా నారా లోకేష్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా లోకేష్‌ స్థానాన్ని సుస్థిరంగా చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 

ఢిల్లీ పర్యటనలో లోకేష్‌ కేంద్ర మంత్రులు, బీజేపీలో ముఖ్యమైన నాయకులతో భేటీ అవుతున్నారు. సాధారణంగా క్యాబినెట్ మంత్రులు ఎవరైనా ఢిల్లీకి వెళితే తమ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలతో భేటీ అవుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే సమీక్షలు, సమావేశాలకు వెళుతుంటారు. అయితే లోకేష్‌ పర్యటనలో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు మొత్తం ఆయన వెంట ఉంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన స్థానాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. కొద్ది వారాల క్రితం పలువురు టీడీపీ నాయకులు లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం చంద్రబాబు వారిని వారించడం జరిగాయి.

వరుస పెట్టి టీడీపీ మంత్రులు, నాయకులు లోకేష్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడంతో చంద్రబాబు జోక్యం చేసుకుని వారిని వారించారు. ఈ క్రమంలో దావోస్ పర్యటనలో చంద్రబాబు వారసత్వాలపై తనకు నమ్మకం లేదని, ఎవరైనా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. లోకేష్‌కు రాజకీయ వారసత్వాన్ని, అధికారాన్ని అందించాలని ఉన్నా అది అందరికీ అమోదయోగ్యమైన విధంగా ఉండాలన్నది చంద్రబాబు అభిమతంగా టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన సాగుతున్న తీరు ఆయన రాజకీయ భవిష్యత్‌ మీద ఊహాగానాలకు తెరతీసింది. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే బాధ్యతలు లోకేష్‌కు దక్కుతాయి. ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా లోకేష్‌తో కలిసి సాగుతున్నారనే వాదనలు ఉన్నాయి.

దేవగౌడ ఆశీస్సులు తీసుకున్న లోకేష్

కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో ఎన్ సిసి డైరక్టరేట్ ఏర్పాటు చేయాలని వినతి

ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎన్ సిసి మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా ఏపీలోని క్యాడెట్లకు మెరుగైన అవకాశాలను కల్పించేందుకు సహకారం అందించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని 5 ఎన్ సిసి గ్రూపులు, 43 యూనిట్ల పరిధిలో 75వేలమందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ సిసి డైరక్టరేట్ తెలంగాణాలో ఉండిపోవడంతో ఏపీలో ప్రత్యేకంగా ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయాలని అమరావతిలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఢిల్లీలో మంత్రి నారా లోకేష్

ఎపిలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించండి!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం (All India Education Ministers' Conclave) ను ఏపీలో ఏర్పాటుచేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ తో మంత్రి లోకేష్ భేటీ

గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటికి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటి ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తదుపరి వ్యాసం