తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandamuri Balayya: తనను మించిన సైక్రియాటిస్ట్‌ లేరంటున్న బాలకృష్ణ

Nandamuri Balayya: తనను మించిన సైక్రియాటిస్ట్‌ లేరంటున్న బాలకృష్ణ

HT Telugu Desk HT Telugu

07 April 2023, 11:18 IST

google News
    • Nandamuri Balayya: తనను మించిన సైక్రియాటిస్ట్‌ ఎవరు లేరని,అంతా తన గురించి ఏదో అనుకుంటారని, తాను మనసులో ఉన్నదే మాట్లాడతానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. తనకు మనుషుల మనస్తత్వాల గురించి బాగా తెలుసని, సైకాలజీ చదవకపోయినా అందరి సైకాలజీ తెలుసన్నారు. 
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

Nandamuri Balayya: ముఖ్యమంత్రికి మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా కూడా తెలియదని నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు. సలహాదారుల మాట కూడా జగన్ వినడని, ముఖ్యమంత్రిలో అదో తరహా సైకో ప్రవర్తన ఉందని బాలకృష్ణ ఆరోపించారు. వైసీపీలో బబుల్ త్వరలో బద్దలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కక్ష అని బాలకృష్ణ ఆరోపించారు. వైసీపీఎమ్మెల్యేలు సేవ చేయడానికి టీడీపీలోకి వస్తే మంచిదే అన్నారు. జనం మీద కక్షతో ముఖ‌్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను మించిన సైక్రియాటిస్ట్‌ లేరని, సైకాలజీ చదవకపోయిన మనుషుల సైకాలజీ తనకు బాగా తెలుసన్నారు.

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని బాలయ్య విమర్శించారు. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా తీసుకు రాలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసి వైసీపీని గెలిపించారని ముఖ్యమంత్రి బాదుడే బాదుడికి గురి కాని వ్యక్తి ఒకరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

జగన్ కు పాలించడం చేత కాదని, సలహాదారులను పెట్టుకున్నా, వారి మాటను కూడా వినడన్నారు. సలహాదారులు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని విమర్శించారు. తమ మాటను జగన్ వినకపోవడంతో సలహాదారులంతా జీతాలు తీసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బాలకృష‌్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ పాదయాత్రను ఎందుకు చేపట్టారో దాని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, దాని ఫలితాన్ని మీరంతా స్వీకరించాలని బాలయ్య అన్నారు.

పాదయాత్ర సందర్భంగా ఇప్పుడు మీలో ఉన్న ఆవేశం, లోకేష్‌ జిల్లా దాటి వెళ్లి పోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి చెంపపెట్టని బాలకృష్ణ అన్నారు. వైసీపీ నేతలలో కూడా అసంతృప్తి ఉందని, ఆ పార్టీలో త్వరలో బుడగ బద్దలవుతుందని చెప్పారు. ప్రజాసేవ చేయాలని కొంతమంది వైసీపీ నేతలకు ఉన్నప్పటికీ ఆయన చేయనివ్వరని జగన్ ను ఉద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని బాలయ్య విమర్శించారు. మద్యం, డ్రగ్స్ ను యువతలోకి పంపి వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కు మనుషులంటే అలర్జీ అని అన్నారు. ఓటు మాత్రమే మీకు రక్ష అని, ఓటును సరైన నాయకుడికి వేయాలని చెప్పారు. సరైన ఓటు వేయకపోతే ప్రజలపై వేటు పడుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ వచ్చే శుభసూచకాలు చాలా కనిపిస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని చెప్పారు.

తదుపరి వ్యాసం