AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం!
28 September 2024, 6:02 IST
- AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్ విద్యపై మంత్రి లోకష్ సమీక్ష
ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో.. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చించారు.
వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రైవేటు ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును అధికారులు లోకేష్‌కు వివరించారు. పనిదినాలు, అకడమిక్ కేలండర్, సిలబస్, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్-టీచర్ మీటింగ్, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల అటెండెన్స్, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం.. విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని నారా లోకష్ నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఇంటర్మీడియట్ విద్యపై కనీస సమీక్ష లేదని.. మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల్లో మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని.. నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాలని, ప్రభుత్వ స్కూళ్లలో బెంచిలు, మంచినీరు, టాయ్ లెట్స్ వంటివి పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశించారు.
'స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టిసారించాలి. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఇంటర్నల్ అస్సెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చెయ్యాలి. నేను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పనితీరు బాగుంది' అని లోకేష్ వివరించారు.
'రాష్ట్రవ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్‌తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలి. శ్రీకాకుళం స్కూలులో కేవలం రూ.50 వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేసినా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారు. లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దాలి' అని లోకేష్ అధికారులను ఆదేశించారు.