Lokesh On NaduNedu: ప్రభుత్వ బడుల్లో నాడు నేడు పనులపై విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్
Published Jul 23, 2024 09:54 AM IST
- Lokesh On NaduNedu: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.
ప్రభుత్వ బడుల్లో నాడునేడు పనుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలంటున్న పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర
Lokesh On NaduNedu: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏపీ అసెంబ్లీలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర ఆరోపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నాడు నేడులో భాగంగా చేపట్టిన పనులపై రఘురామరామకృష్ణంరాజు, ధూళిపాళ మాట్లాడారు.
నాడునేడు పేరుతో చేపట్టిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. కేంద్రీకృత కొనుగోళ్లతో పెద్ద ఎత్తున వైసీపీ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పాఠశాల కమిటీల పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.
గ్రామాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ పేరెంట్స్ కమిటీలు పేరుకే పరిమితం అయ్యాయని, పొన్నూరులో ఓ పాఠశాలలో రూ.18లక్షలతో టాయిలెట్స్ మరమ్మతులు చేశామని చెప్పి రూ.28లక్షలు డ్రా చేసుకున్నారని అక్కడ కేవలం రంగులు మాత్రమే వేసి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. మరమ్మతులు చేయకుండానే చేసినట్టు చూపించి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాడునేడు పనులు పూర్తి చేయాలంటే రూ.4వేల కోట్లు అవసరమని ఆ పేరుతో చేసిన ఖర్చులో చాలా భాగం పక్కదారి పట్టిందన్నారు. నాడు అక్రమాలపై విచారణ జరిపించాలని సభలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన క్రీడా ప్రాంగణాలు ఉంటున్నా, వ్యాయామ ఉపాాధ్యాయులకు తగినంత పని ఉండటం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాడునేడు పనులపై విచారణ జరిపిస్తామని, పనులు జరిగిన తీరుపై నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అక్రమాలు జరిగితే ఖచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలను పెంచుతామని, ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడతామన్నారు. నాసిరకం పనులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. అక్రమాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదన్నారు.