LIC Policy Surrender : ఐఆర్డీఏఐ కొత్త రూల్, లైఫ్ పాలసీ సరెండర్ వ్యాల్యూ 80 శాతం- ఎల్ఐసీ పాలసీ సరెండర్ విధానం ఎలా?
08 October 2024, 13:57 IST
- LIC Policy Surrender : ఎల్ఐసీ పాలసీ తీసుకుని, కొన్ని ప్రీమియంలు కట్టి ఆ తర్వాత కట్టకుండా వదిలేశారా? అయితే ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల మేరకు మీరు ఒక ఏడాది ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత మానేసినా..చెల్లించిన ప్రీమియంలో 80-85 శాతం తిరిగి చెల్లించాలి. ఎల్ఐసీ పాలసీ ఎలా సరెండర్ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఐఆర్డీఏఐ కొత్త రూల్, లైఫ్ పాలసీ సరెండర్ వ్యాల్యూ 80 శాతం- ఎల్ఐసీ పాలసీ సరెండర్ ఎలా?
చాలా మంది ఎల్ఐసీ పాలసీలు తీసుకుని, కొన్ని సంవత్సరాలు ప్రీమియమ్స్ కట్టి ఆ తర్వాత చెల్లించడం మానేస్తారు. దీంతో ఆ పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. అయితే మనం ప్రీమియం చెల్లించలేకపోతే... ఆ పాలసీలను సరెండర్ చేయవచ్చు. అందుకు తగిన నిబంధనలు ఉన్నాయి. వీటికి తగిన విధంగా మనం చెల్లించిన ప్రీమియంలో కొంత మినహాయించి మిగిలిన అమౌంట్ ను కంపెనీ తిరిగి చెల్లిస్తుంది.
మీరు పాలసీని మెచ్యూరిటీకి ముందు నిలిపివేస్తే దానిని పాలసీని సరెండర్ చేయడం అని పిలుస్తారు. ఎల్‌ఐసీ పాలసీ సరెండర్ విలువ మెచ్యూరిటీ ప్రయోజనాల కంటే చాలా తక్కువ ఉంటుంది.
ఎల్‌ఐసీ పాలసీని ఎప్పుడు సరెండర్ చేయవచ్చు?
ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ పాలసీలను రెండో సంవత్సరంలో సరెండర్ చేయవచ్చు.
పరిమిత, సాధారణ ప్రీమియం ప్లాన్‌లలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వ్యవధి గల పాలసీలను 2 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి పాలసీలను 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు.
ఎల్ఐసీ పాలసీ సరెండర్ చేయడం ఎలా?
మీ పాలసీని సరెండర్ చేయడం మంచిది కాదు, అయినా తప్పనిపరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఈ డాక్యుమెంట్‌లు సిద్ధం చేసుకోవాలి. వీటిని మీ ఎల్ఐసీ ఏజెంట్ లేదా ఎల్ఐసీ ఆఫీసులో సమర్పించవచ్చు. సరెండర్ కు అవసరమయ్యే పత్రాలు ఇవే.
- ఒరిజినల్ పాలసీ బాండ్ పత్రాలు
- సరెండర్ కోసం అభ్యర్థన
- సరెండర్ ఫారమ్
- ఎల్ఐసీ ఎన్ఈఎఫ్టీ ఫారమ్
- బ్యాంక్ ఖాతా వివరాలు
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ ఐటీ రుజువు
- క్యాన్సిల్డ్ చెక్కు
- ఎందుకు సరెండర్ చేస్తున్నారో తెలుపుతూ ఎల్ఐసీకి లేఖ
ఎల్ఐసీ పాలసీ సరెండర్ విలువ ఎంత?
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) లైఫ్ పాలసీల సరెండర్ విలువపై కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. లైఫ్ ఇన్సూరర్ అందించే ప్రతి పాలసీ కచ్చితమైన సరెండర్ విలువ అందించాలని ఆదేశించింది. అలాగే పాలసీ తదుపరి ప్రీమియం చెల్లించకపోతే లాప్స్ కాకూడదని రెగ్యులేటర్ చెబుతోంది.
పాలసీదారులు కేవలం ఒక సంవత్సరం ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా కొత్త నిబంధనల మేరకు అధిక వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో పాలసీ సరెండర్ లేదా రద్దు మొదటి రెండు సంవత్సరాలలో వర్తించేది కాదు. మూడో సంవత్సరం నుంచి కూడా నామమాత్రంగా, ఏకపక్షంగా సరెండర్ విలువ చెల్లించేవారు. అయితే పాలసీదారులను దృష్టిలో పెట్టుకుని ఐఆర్డీఏఐ తాజా నిబంధనలు తెచ్చింది.
ఒక సంవత్సరం తర్వాత ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీని నిలిపివేసినట్లయితే(లాప్స్ అయితే) మీరు చెల్లించిన ప్రీమియంలో 80-85% వరకు తిరిగి పొందవచ్చు. ఉదాహరణకు మీరు నెలవారీ ప్రీమియం రూ. 10,000 (ఏడాదికి రూ. 1,20,000) చెల్లించినట్లయితే, మీరు సరెండర్ విలువగా లక్ష కంటే కొంచెం ఎక్కువగానే పొందుతారు. కొత్త నిబంధనల మేరకు సరెండర్ కోసం కొన్ని నిర్దిష్ట వాల్యుయేషన్ అమల్లోకి తెచ్చారు.
అధిక వాపస్
పాలసీదారు మొదటి సంవత్సరం తర్వాత పాలసీని సరెండర్ చేస్తే ప్రీమియంలో అధిక భాగాన్ని తిరిగి పొందేందుకు చట్టబద్ధంగా అర్హుడు. మీ పాలసీ నెలవారీ ప్రీమియం రూ. 20,000 అయితే ఏడాది తర్వాత చెల్లించిన ప్రీమియంలో 80-85% పొందవచ్చు. కొత్త నిబంధనల మేరకు సరెండర్ చేయడానికి అనుమతించడమే కాకుండా, కొత్త బీమా సంస్థకు పోర్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని కూడా ఇస్తారు.