JEE Mains and AP CETs : నేడు జేఈఈ మెయిన్స్…. ఏపీ కామన్ ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదల
24 January 2023, 7:34 IST
- JEE Mains and AP CETs జేఈఈ మెయిన్స్ పరీక్షలను నేడు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు 2023-24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పలు కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
నేడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణ
JEE Mains and AP CETs ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టే ఈఏపీసెట్‌ను మే 15 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ వెల్లడించారు.గతంలో ఎంసెట్‌గా నిర్వహించే పరీక్షను కొన్నేళ్లుగా ఈఏపీసెట్‌గా పేర్కొంటున్నారు.
ప్రతి ఏటా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. పీజీసెట్, ఆర్‌సెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు మే నెలలోనే నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
2023 మే 5న ఈ సెట్ నిర్వహించనున్నారు. మే 15-22 మధ్య ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్ధుల కోసం నిర్వహిస్తారు. ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్ధులకు మే 23-25 తేదీల మధ్య నిర్వహిస్తారు. పీజీఈసెట్ పరీక్షను మే 28-30 తేదీల మధ్య నిర్వహిస్తారు. లాసెట్ పరీక్షను మే 20న నిర్వహిస్తారు. ఎడ్ సెట్ ను మే 20న నిర్వహిస్తారు. పీజీ సెట్‌ను జూన్ 6-10 తేదీల మధ్య నిర్వహిస్తారు. ఆర్ సెట్‌ను జూన్ 12-14 తేదీల మధ్య నిర్వహిస్తారు.
నేడు జేఈఈ మెయిన్స్…..
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసి వేస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులెవర్నీ బయటకు పంపించరు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు, హాజరు షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకువెళ్లాలి. మాస్కులను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకువెళ్లే వాటిని అనుమతించరు. జేఈఈ పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 8,66,411 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే మొదటి ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంటే, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. విజయవాడ నగరంలోలో 15 వేల మందికి జేఈఈ పరీక్షలు రాయనున్నారు.