తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Insurance Frauds: వాహనాల ఇన్సూరెన్స్‌ కంపెనీలు మోసం చేస్తుంటే ఇకపై ఇలా చేయండి.. మరమ్మతులు ఎక్కడైనా చేసుకోవచ్చు…

Insurance frauds: వాహనాల ఇన్సూరెన్స్‌ కంపెనీలు మోసం చేస్తుంటే ఇకపై ఇలా చేయండి.. మరమ్మతులు ఎక్కడైనా చేసుకోవచ్చు…

03 October 2024, 12:45 IST

google News
    • Insurance frauds: రోడ్డు ప్రమాదాలు, ప్రకృత్తి విపత్తుల సందర్భంగా వాహనాలు దెబ్బతింటే బీమా పరిహారాన్ని ఎగ్గొట్టడానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కార్ల షోరూమ్‌లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. బీమా ఎగ్గొట్టడానికి కంపెనీలు  ప్రయత్నిస్తే  సెటిల్‌మెంట్‌ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...
బీమా సెటిల్‌ చేయకుండా మొండికేస్తే  ఇలా చేయండి...
బీమా సెటిల్‌ చేయకుండా మొండికేస్తే ఇలా చేయండి...

బీమా సెటిల్‌ చేయకుండా మొండికేస్తే ఇలా చేయండి...

Insurance frauds: వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు మరమ్మతు ఖర్చులు తక్కువగా ఉంటే వాటిని సెటిల్ చేయడానికి బీమా కంపెనీలు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పవు. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్ర ప్రమాదాల్లో దెబ్బతిన్నపుడు మాత్రం ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టుకోడానికి వాహనాలు యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వాహనాలు ప్రమాదానికి గురైనపుడు, లేదా ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్నపుడు, వరదల్లో ముంపుకు గురైనపుడు వాటి ఫోటోలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ప్రమాద స్థలంలో, ముంపుకు గురైన ప్రదేశంలో ఫోటో తీసిన తేదీ, సమయం వచ్చేలా ఫోటోలు తీసుకోవాలి. వీలైతే జీపీఎస్‌ వివరాలు కూడా ఫోటోల్లో వచ్చేలా ఫోటోలను తీసుకోవాలి.

ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో డామేజ్ అయిన వాహనాలను సాధారణంగా మరమ్మతుల కోసం కంపెనీ షోరూమ్‌ల వద్దకే తీసుకెళ్లమని ఇన్సూరెన్స్ కంపెనీలు సూచిస్తాయి. ఇటీవల విజయవాడను బుడమేరు వరదలు ముంచెత్తిన సమయంలో వేలాది వాహనాలు నీటమునిగాయి. ఖరీదైన కార్లు కొత్తవి, పాతవి రోజుల తరబడి వరద ముంపులో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షోరూమ్‌‌లలో వాహనాలను మరమ్మతు చేయడానికి తగినంత సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. దీంతో పాటు అమ్మకాలు పెంచుకోడానికి వాటిని డిస్పోజ్ చేయాలని సూచిస్తున్నాయి.

వరదల్లో మునిగిన వాహనాల్లో ఆటోమెటిక్‌ వాహనాలు, బిఎస్‌ 6 వాహనాలు, కొత్త టెక్నాలజీతో రూపొందిన వాహనాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇలాంటి వాహనాలను మరమ్మతు చేయడానికి లక్షలాది రుపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్‌ వాల్యూయేషన్ సర్వేయర్లు, కంపెనీ ప్రతినిధులు కుమ్మక్కవుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ మాటలు నమ్మకండి...

ప్రమాదానికి గురైన వాహనాలు, వరదల్లో ముంపుకు గురైన వాహనాలను షోరూమ్‌లకు తరలించిన తర్వాత వీలైనంత త్వరగా కంపెనీ నుంచి రిపేర్‌ ఎస్టిమేషన్‌ రాతపూర్వకంగా పొందాల్సి ఉంటుంది. యజమాని సమక్షంలోనే వాహనం నష్టం వివరాలను రూపొందించాల్సి ఉంటుంది.వాహనాల కంపెనీ డీలర్లు, వారి ప్రతినిధులు రూపొందించిన అంచనాలను ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించి షోరూమ్‌లో రిపేర్‌ చేయించాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రమాదాల్లో దెబ్బతిన్న వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కొన్ని ముఠాలు ఒప్పందాలు చేసుకుంటాయి. వాహనం మోడల్, కొనుగోలు చేసిన సంవత్సరం బట్టి దాని విలువ తగ్గుతూ ఉంటుంది. వాహనానికి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే సమయంలో దాని నష్టం విలువను ముందే నిర్దారించుకుని ప్రీమియం చెల్లించాలి. ఇన్సూరెన్స్‌ డామేజ్‌ వాల్యూను మాత్రమే ప్రమాదాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి.

ఫుల్‌ డామేజ్‌గా గుర్తించిన వాహనాల మరమ్మతుల ఖర్చు షోరూమ్‌లో ఒక్కోసారి ఇన్సూరెన్స్‌ విలువ కంటే రెట్టింపు అంచనాలు వేస్తారు. కస్టమర్ తన వాహనంపై ఆశ వదులుకునేలా మెకానిక్‌లు, ఇన్సూరెన్స్‌ వాల్యూయేటర్లు, షోరూమ్‌ ప్రతినిధులు ప్రయత్నిస్తారు. వాహనం ఎందుకు పనికి రాదని దాని బదులు ఇన్సూరెన్స్‌లో వచ్చే సొమ్ముతో సెటిల్‌ చేసుకోవాలని సూచిస్తారు. ఇన్సూరెన్స్‌ వాల్యూయేషన్ సందర్భంగా జరిగే చర్చలను వాహనాల యజమానులు వీలైతే ఆడియో, వీడియో రికార్డ్ చేసుకోవడం ద్వారా కంపెనీల మోసాలను భవిష్యత్తులో నిలదీసే అవకాశం ఉంటుంది.

బెంబేలెత్తిపోకండి…

ఇలాంటి సందర్భాల్లో బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. షోరూమ్‌ రిపేర్ ఛార్జీలకంటే తక్కువ ఖర్చుతోనే బయట కూడా మరమ్మతులు చేసుకోవచ్చు. విజయవాడలో ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లలో వెలుగు చూసిన అక్రమాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివాదాల పరిష్కారం కోసం అన్ని కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పాడైన వాహనాలను యజమాని ఎక్కడ బాగు చేయించుకున్నా దాని బీమా పరిహారం చెల్లించాలని కంపెనీలకు సూచించింది. వాహనం రిపేర్ ఎక్కడ చేయించుకోవాలనేది పూర్తిగా వాహనం యజమాని ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

ఇన్సూరెన్స్ చెల్లింపుల విషయంలో జరిగే చర్చలు, వాహనాలను ఫుల్‌ డామేజ్‌ కింద జమ చేయాలనే ప్రయత్నాలకు భయపడిపోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ బీమా రంగ సంస్థల అధికారులు చెబుతున్నారు. వాహనం మరమ్మతుల ఖర్చును అంచనా వేసి ఆ మొత్తాన్ని ఏ బీమా సంస్థ అయినా చెల్లించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్‌ సెటిల్‌మెంట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు.

వాహనాల అధీకృత డీలర్ల వద్ద రిపేర్ ఖర్చుల కంటే నిపుణులైన మెకానిక్‌లు అందులో 30-40శాతం ఖర్చులోనే పూర్తి చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి క్లెయిమ్స్ సెటిల్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో పాడైన వాహనాలను కూడా ఇంజిన్ డామేజ్ అయ్యిందని, ఎందుకు పనికి రాదని మభ్య పెట్టే ప్రయత్నాలు చేసినపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. బీమా పరిహారం విషయంలో కంపెనీల నుంచి సరైన న్యాయం జరగలేదని భావిస్తే న్యాయపరమైన పోరాటం చేసే అవకాశం కూడా బాధితులకు ఉంటుంది.

తదుపరి వ్యాసం