తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Chairman : శ్రీవారి భక్తులే టార్గెట్.. టీటీడీ ఛైర్మన్ ఫొటోతో బ్రేక్ దర్శనం టికెట్ల దందా!

TTD Chairman : శ్రీవారి భక్తులే టార్గెట్.. టీటీడీ ఛైర్మన్ ఫొటోతో బ్రేక్ దర్శనం టికెట్ల దందా!

Published Feb 17, 2025 03:39 PM IST

google News
    • TTD Chairman : దేశవిదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు.. ఆయన దర్శనం కోసం పరితపిస్తారు. లక్షలు ఖర్చుపెట్టైనా స్వామివారిని దర్శించుకుంటారు. సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేశారు హైదరాబాద్‌కు చెందిన యువకుడు. ఏకంగా టీటీడీ ఛైర్మన్ ఫొటో ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని భక్తులను మోసం చేశాడు.
టీటీడీ ఛైర్మన్

టీటీడీ ఛైర్మన్

తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం టికెట్ల దందా మరొకటి బయటకు వచ్చింది. ఈసారి కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై టీటీడీ అలర్ట్ అయ్యింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. తన ఫొటోతో కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, భక్తులు ఇలాంటి వారిని నమ్మొద్దని స్పష్టం చేశారు.

ఎన్‌ఆర్ఐ భక్తులే టార్గెట్..

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని ఓ కేటుగాడు మోసాలకు పాల్పడుతున్నాడు. తిరుమల సమాచారం అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తులు టార్గెట్ చేసుకొని.. మోసాలకు పాల్పడుతున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే.. మోసపోయామని తెలుసుకొని.. బాధిత భక్తులు ఛైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు.

విచారణకు ఆదేశం..

దీనిపై విచారణ జరపాలని బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో ఫోన్ నంబర్ ట్రేస్‌ చేయగా.. మోసగించిన వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావెద్ ఖాన్‌గా తేలింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి.. భక్తులను మోసగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని.. విజిలెన్స్, పోలీసు అధికారులను అదేశించారు ఛైర్మన్ బీఆర్ నాయుడు.

21న సేవా టికెట్లు విడుదల..

మే-2025కి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు.. 21.02.2025 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, వసతి కోటా (రూ. 10,000/-) దాతలు అదేరోజు ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.

సమయానికే రండి..

'తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలి. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి.. అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు' అని టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం