AP MLC Elections 2025 : కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - పోటీ ఎవరి మధ్య..? 9 ముఖ్యమైన అంశాలు
Published Feb 13, 2025 03:26 PM IST
- కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది.
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పోటీ ఎవరి మధ్య..?
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పోటీ ఎవరి మధ్య..?
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. అధికార టీడీపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికి సవాల్‌గా మారాయి. అందుకే గెలుపు కోసం గత ఐదు నెలలుగా కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు - ముఖ్యమైన అంశాలు:
- నామినేషన్ల గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరనేది కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన తరువాత మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే నేటి (ఫిబ్రవరి 13)తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఆ తరువాత బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వస్తోంది.
- మొత్తం 30 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినప్పటికీ, ప్రధానంగా టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా), పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఆలపాటి రాజా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడు. ఇక కేఎస్ లక్ష్మణరావు లెక్చరర్‌గా పని చేసి తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలబడి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
- ఈ ఎన్నికలను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓటర్ల చేర్పించడం నుంచి ప్రచారం వరకూ చాలా పగడ్భందీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ… ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
- కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ.. జనసేన శ్రేణులు ఆశించిన స్థాయిలో ప్రచారంలో భాగం కాలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిల్లో టీడీపీ నేతలు మాత్రం జోరుగా ప్రచారం చేస్తున్నారు.
- కూటమి సమావేశాల్లో జనసేన నాయకులను ఆహ్వానించినప్పటికీ… జనసేన కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆలపాటి రాజా నామినేషన్ కార్యక్రమానికి జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. కానీ జనసేన కార్యకర్తలు ఆశించినంతగా హాజరు కాలేదనే టాక్ వినిపిస్తోంది.
- ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల జోక్యాన్ని పలువర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- కోటీశ్వరుడికి మధ్యతరగతికి మధ్య పోటీ జరుగుతోందని కేెెఎస్ లక్ష్మణరావు మద్ధతుదారులు అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పెన్షనర్ల, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు లక్ష్మణరావుకు మద్దతుగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన… ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, ప్రజా సమస్యలను చట్టసభల్లో లెవెనత్తారు.
- అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులే తమకు బలమని టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అంటున్నారు. ఉద్యోగం, ఉపాధి తమ అజెండా అంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటం ఆయనకు సానుకూల అంశం. ఇక పీడీఎఫ్ అభ్యర్థి ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో బలమైన పోటీ ఇస్తున్నారు.
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఫిబ్రవరి 27 (గురువారం) (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు), ఓట్ల లెక్కింపు మార్చి 3 (సోమవారం) ఉంటుంది. పోలింగ్ ఆరు జిల్లాల్లో జరుగుతోంది. కృష్ణా, ఏన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే ఇందులో ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ జరుగనుంది.