తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bird Flu Alert : చెరువుల్లో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్

AP Bird Flu Alert : చెరువుల్లో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్

Published Feb 13, 2025 11:26 AM IST

google News
    • AP Bird Flu Alert : ఏపీని బర్డ్‌ ఫ్లూ వణికిస్తోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అటు మనిషికి కూడా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
బర్డ్‌ ఫ్లూ (istockphoto)

బర్డ్‌ ఫ్లూ

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. కోళ్ల ఫామ్ సమీపంలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగా.. అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులో అతడికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఉంగుటూరు మండలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ తొలికేసు నమోదైనట్లు.. వైద్యాధికారిణి డాక్టర్‌ మాలిని వెల్లడించారు.

చేపలకు మేతగా..

ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. చేపల చెరువులకు బర్డ్‌ ఫ్లూ కోళ్లను మేతగా వేస్తున్నారు. చనిపోయిన కోళ్లను చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో.. చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలను కాకినాడలోని ఎన్జీవో సభ్యులు విడుదల చేశారు.

లక్షలాది కోళ్లు మృతి..

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇటీవల లక్షలాది కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. దీనికి కారణమైన బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పశువైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఎగుమతులపై ఎఫెక్ట్..

బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 350 కోళ్ల ఫామ్‌లు ఉన్నాయి. వీటిల్లో రోజుకు సుమారు 24 మిలియన్ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బర్డ్ ఫ్లూ రావడంతో.. ఎగుమతులు భారీగా తగ్గాయి. దీంతో కోళ్ల పెంపకందారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ..

ప్రస్తుత పరిస్థితులపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు కీలక విషయాలు వెల్లడించారు. గత మూడు రోజుల్లో తణుకు మండలంలోని వేల్పూరు, పెరవలి మండలం కానూరు అగ్రహారం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయని వెల్లడించారు. "చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి.. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు విశ్లేషణ కోసం పంపారు. పరీక్షల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు" అని దామోదర్ నాయుడు చెప్పారు.

ప్రభావిత ప్రాంతాలపై నిఘా..

"అధికారులు త్వరగా నియంత్రణ చర్యలను అమలు చేశారు. ప్రభావిత గ్రామాలపై నిఘా పెట్టారు. ప్రభావిత గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపుపై నిఘా పెట్టారు. పోలీసు, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను నియమించారు" అని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం