తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Delhi: డిసెంబర్‌‌లో విశాఖ రైల్వే‌ జోన్‌ శంకుస్థాపన, కొత్త జోన్‌లోనే విశాఖ డివిజన్, ఢిల్లీలో బాబు బిజీబిజీ…

CBN In Delhi: డిసెంబర్‌‌లో విశాఖ రైల్వే‌ జోన్‌ శంకుస్థాపన, కొత్త జోన్‌లోనే విశాఖ డివిజన్, ఢిల్లీలో బాబు బిజీబిజీ…

08 October 2024, 7:04 IST

google News
    • CBN In Delhi: విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబర్‌ నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త జోన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కేకే లైన్ మినహా అరకు వరకు విశాఖ డివిజన్‌లోనే కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేడు కూడా కొనసాగనుంది. 
ప్రధాని నరేంద్ మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రధాని నరేంద్ మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ప్రధాని నరేంద్ మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

CBN In Delhi: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం, విభజన హామీల్లో ముఖ్య మైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

ప్రధానితో భేటీ నేపథ్యంలో డిసెంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంపీలకు వివరించారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీయే కూటమి ఎంపీలతో చెప్పారు.

పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ప్రధాని మోదీని కలిశారు. గంటన్నర పాటు ఈ భేటీ సాగింది.

ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్- 2047 విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి ఆంధ్రా- 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో చెప్పారు. స్వాతంత్య్ర శత వసంతాలు నిర్వ హించుకునే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవ స్థను 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి, తల సరి ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వరద సాయం అందించాలని విజ్ఞప్తి….

ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్‌లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలవడంపై సీఎం చంద్రబాబు 'ఎక్స్'లో స్పందించారు. ప్రధాని మోదీతో ఫలవంతంగా చర్చలు జరిగాయని తెలిపారు. పోలవరం రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానన్న సీఎం, ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉందన్నారు. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలవడంపై కూడా 'ఎక్స్'లో సీఎం చంద్రబాబు స్పందించారు. డిసెంబరు నాటికి విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్ హామీ నెరవేర్చిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు చెప్పానని తెలిపారు. ఏపీలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారన్నారు.

ఏపీలో రైల్వే రూ.73,743 కోట్లు పెట్టుబడి పెడుతుందని మంత్రి చెప్పారని, హౌరా-చెన్నై మధ్య 4-లేనింగ్, 73 స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని లోకల్ రైళ్లు ప్రవేశపెట్టవచ్చని, ఏపీలో లాజిస్టిక్‌, కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బలోపేతం చేస్తున్నట్లు, ఈ దిశగా రైల్వేతో భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని 'ఎక్స్​' వేదికగా స్పందించారు.

మంగళవారం కూడా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, మంగళవారం ఉదయం ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలుస్తారు. అమరావతి ORR సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి మాట్లాడతారు. ఉదయం 11.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం అయ్యాక, సాయంత్రం పీయూష్‌ గోయల్‌, హర్‌దీప్‌సింగ్ పురిని కలవనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.

తదుపరి వ్యాసం