తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Grama Sachivalayam : సచివాలయ వ్యవస్థకు ఐదేళ్లు.. జగన్ సాధించింది ఏంటీ?

AP Grama Sachivalayam : సచివాలయ వ్యవస్థకు ఐదేళ్లు.. జగన్ సాధించింది ఏంటీ?

04 October 2024, 5:05 IST

google News
    • AP Grama Sachivalayam : అది 2019 అక్టోబర్ 2వ తేదీ. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చారిత్రాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టిన రోజు. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిని నిర్మించి.. ఆ వారధి ద్వారా సంక్షేమం అందించాలని జగన్ సంకల్పించారు. ఆ సంకల్పానికి కార్యరూపమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.
సచివాలయ సిబ్బందితో జగన్ (02-10-2019 నాటి చిత్రం)
సచివాలయ సిబ్బందితో జగన్ (02-10-2019 నాటి చిత్రం)

సచివాలయ సిబ్బందితో జగన్ (02-10-2019 నాటి చిత్రం)

ప్రజల వద్దకే పాలన.. ఎంతోమంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి ఈ మాట వింటాం. కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. దీంతో ఏ పని జరగాలన్నా వైట్ కాలర్ ప్రమేయం తప్పనిసరి అయ్యింది. ఆఖరికి ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలన్నా.. లోకల్ లీడర్ దగ్గరకే వెళ్లే పరిస్థితి.

అలాంటి పరిస్థితికి వైఎస్ జగన్ చెక్ పెట్టారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెలల వ్యవధిలోనే.. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2019 అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో శాశ్వత ఉద్యోగులతో పాటు.. వాలంటీర్లను నియమించారు. ఒక్కో వాలంటీర్‌కు 50 ఇళ్ల చొప్పున అప్పగించి.. సంక్షేమాన్ని గడప గడపకూ అందించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టి అక్టోబర్ 2వ తేదీ నాటికి ఐదేళ్లు నిండాయి.

2014 నుంచి 2019 వరకూ ఏపీలోని గ్రామాల్లో జన్మభూమి కమిటీలదే హవా. గ్రామంలోని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా.. ఇతర ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ పరిస్థితులు టీడీపీకి నష్టం చేశాయనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. అందుకే.. జగన్ లోకల్ లీడర్ల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. ప్రజల అవసరాలు తీర్చే ప్రయత్నం చేశారు.

వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలను వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అందించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు అందించారు.

ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ నిర్మించారు. వీటిల్లో పనిచేసే సిబ్బంది గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అవసరాలు తీర్చారు. కోవిడ్ లాంటి సమయంలో.. గ్రామ, వార్డు సచివాలయాల పాత్ర కీలకం అని చెప్పాలి. నిత్యావసరాలు మొదలు.. వ్యాక్సిన్ల వరకూ అన్నీ సచివాలయాల ద్వారానే జరిగాయి. అప్పుడు వాలంటీర్ల సేవలు అభినందనీయమనే ప్రశంసలు వచ్చాయి.

అయితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి సచివాలయ సిబ్బంది.. ముఖ్యంగా వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. దీన్ని గమనించిన రాజకీయ పార్టీలు.. వారిని తమవైపు తిప్పుకునేందుకు పావులు కదిపాయి. టీడీపీ ఏకంగా వాలంటీర్లకు ఇచ్చే వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పింది. ఎన్నికల్లో వాలంటీర్లు ఎవరి కోసం పనిచేశారనే విషయం పక్కనబెడితే.. ఇప్పుడు మళ్లీ గ్రామ, వార్డు సచివాలయాల గురించి చర్చ జరుగుతోంది.

ఇటీవల విజయవాడలో వరదలు వచ్చాయి. పరిహారం కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వరదల సమయంలోనూ సాయం కోసం ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో.. 2019- 2024 మధ్య ఉన్నట్టు గ్రామ, సచివాలయాల వ్యవస్థ పనిచేసి ఉంటే.. తమకు తిప్పులు తప్పేవని ప్రజలు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ.. చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో ఓ నేత తన ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. అప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ జన్మభూమి కమిటీల రోజులు వచ్చాయని వైసీపీ ఆరోపించింది. అటు లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చేవారని.. ఇప్పుడు ఇదేం పరిస్థితి అని వాపోయారు.

ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందనే బాధ ఉన్నా.. ప్రజలు జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తుంటే సంతోషంగా ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసి.. సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సాధించింది ఇదేనని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా.. ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.

తదుపరి వ్యాసం