Amaravati AI University : అమరావతిలో తొలి ఏఐ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎంతో కలిసి ఏర్పాటుచేయనున్న రిలయన్స్
17 August 2024, 21:32 IST
- Amaravati AI University : ఏపీ రాజధాని అమరావతిలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఎస్ఆర్ఎం వర్సిటీతో కలిసి రిలయన్స్ సంస్థ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
అమరావతిలో తొలి ఏఐ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎంతో కలిసి ఏర్పాటుచేయనున్న రిలయన్స్
Amaravati AI University : అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో కలిసి రిలయన్స్ సంస్థ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు సిద్ధం అయింది. దేశంలోనే నెంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరొందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీ అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇప్పటికే అమరావతిలో అతి పెద్ద క్యాంపస్‌ను నిర్వహిస్తోంది. అయితే గత ప్రభుత్వ పాలనలో విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగాయి. ప్రభుత్వం మారడంతో ఈ పనులు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి.
ఇటీవలి సీఎం చంద్రబాబు నాయుడుతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధి బృందం సమావేశం అయింది. ఈ సందర్భంగానే ఏఐ యూనివర్సిటీ గురించి చర్చకు వచ్చింది. ఇలాంటి యూనివర్సిటీ నిర్వహణకు ఒక కార్పొరేట్ కంపెనీ అండగా ఉంటే మంచిదని అభిప్రాయానికి వచ్చారు. దీంతో రిలయన్స్‌తో చర్చలు జరిపారు.
భవిష్యత్తులో ఏఐ వంటి టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. మానవ వనరులను తరువాత తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడంతో ఏఐ కీలక పాత్ర ఉంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే ఆవిష్కరణలన్నీ ఏఐ కేంద్రంగానే ఉంటాయనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఈ యూనివర్సిటీ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.
అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ
రాష్ట్ర రాజధాని అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అధ్యక్షుడు మన్నన్ కుమార్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్న్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అపూర్వకుమార్ శర్మ, కార్యదర్శి సుమంతో సేన్, సభ్యులు సురేశ్ చంద్ర శ్రీమాలి, అమిత్వేద్ అశోక్‌పాండే, నళిని చతుర్వేదిలతో కూడిన బీసీఐ ప్రతినిధి బృందం వేర్వేరుగా సమావేశం అయింది.
బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్ అమరావతిలో లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1986లో బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, 2022లో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు జరిగాయి. ఇప్పుడు అదే స్థాయిలో అమరావతిలో బీసీఐ ట్రస్ట్ నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్‌లో తెలిపారు. దేశంలోనే న్యాయవిద్యను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందడుగు పడిందని అన్నారు. అమరావతిలో బీసీఐ నెలకొల్పే యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతోందని అన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు బీసీఐ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఆలూరి రామిరెడ్డి తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు