Palnadu Crime: ఐదేళ్ల కుమార్తెపై కన్నతండ్రి లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు..పల్నాడులో దారుణం
28 August 2024, 9:43 IST
- Palnadu Crime: పల్నాడు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి కూతురిపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదేపదే చెప్పినా బుద్ధి రాకపోవడంతో పోలీసులకు కట్టుకున్న భార్యే ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కామాంధు తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఐదేళ్ల కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం
Palnadu Crime: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే తన ఐదేళ్ల కుమార్తెపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వేయకూడని చోట చేతులు వేస్తుంటే, అభం శుభం తెలియని ఆ చిట్టి తల్లికి ఏం చేయాలో తెలియలేదు. తల్లి గమనించి మందలించినా, పంచాయితీ పెట్టినా అతనిలో మార్పు రాలేదు. దీంతో నిందితుని భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్ల పట్టణంలోని ఒక కాలనీకి ఒక వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి వెల్దుర్తి మండలానికి చెందిన మహిళతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెపై నిందితుడు (కన్న తండ్రే) లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
ఆ చిన్నారికి మూడేళ్లు ఉన్నప్పుడే రెండేళ్ల కిందట తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. భర్త తీరుతో ఆవేదనకు గురైన మహిళ మనస్తాపంతో రెండేళ్ల క్రితం ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
రెండు నెలల కిందట పెద్ద మనుషులతో పంచాయితీ చేయించి, తాను మారానని, ఇకపై ఎలాంటి తప్ప చేయనని భర్త నమ్మబలికాడు. భర్త మాయమాటలు నమ్మి, పెద్ద మనుషుల హామీతో భర్తతో మాచర్ల వెళ్లేందుకు భార్యా, పిల్లలు అంగీకరించారు. ఆ తర్వాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. పది రోజులుగా రాత్రి సమయాల్లో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి భార్య, కుమార్తెకు తాగించేవాడు. ఆపై కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఉదయం పూట కూతురు టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో బాధతో ఏడుస్తుంటే, అనుమానం వచ్చిన తల్లి బిడ్డను మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో తల్లి హతాశురాలైంది. అక్కడ నుంచి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డపై తన భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డానని, ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ ప్రభాకరరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును నివేదికను డీఎస్పీకి అందచేశారు. కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశంలో బాలికపై అత్యాచారం…
ప్రకాశం జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మాయమాటలతో ఏడు నెలలుగా నిరుపేద బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాలిక గర్భం దాల్చడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా ముండమూరు మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలిక (17)పై గంగన్నపాలెంకు చెందిన శ్రీరామ్ అనే యువకుడు కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లేవాడు. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. అండగా ఉంటానని చెప్పేవాడు.
బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా చంపేస్తానని ఆ బాలికను బెదిరించేవాడు. ఏడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేకపోతే అక్కడికి వెళ్లడం అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
కొన్ని రోజులుగా ఆ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి కుమార్తెను ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఏడు నెలల గర్భిణిగా తేల్చారు. దీంతో బాధితురాలి తల్లి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ విచారణ చేపడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)